పాలమూరు సభలో కేసీఆర్ మాటలు పచ్చి అబద్దాలు

పాలమూరు జిల్లా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు అంటూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ  మండిపడ్డారు. కెసిఆర్ తన పాలనలో పాలమూరు జిల్లాలో వలసలు లేవని చెబుతున్నారని పేర్కొంటూ ఈ విషయంలో తమతో కలిసి పాలమూరు జిల్లాలో తిరిగే దమ్ముందా అంటూ ఆమె సవాల్ విసిరారు.

వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చాలని కేంద్రానికి పంపినా కేంద్రం పట్టించుకోలేదని చెబుతున్న కేసీఆర్, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పంపిన పత్రాన్ని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు తన కూతురిని మద్యం కేసు నుంచి ఎలా తప్పించాలి అన్న ఆలోచన తప్ప తెలంగాణ అభివృద్ధి పై ఆలోచన లేదని అరుణ విమర్శలు గుప్పించారు. 

ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని, ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆమె  ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేని కేసీఆర్ కేంద్రం అడ్డుకుంటున్నది అంటూ అసత్య ప్రచారం చేసి, కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కాళ్ళు అడ్డుపెట్టటం లేదని, కెసిఆర్ అసమర్థతో, అవినీతితో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని  అరుణ ఆరోపించారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవని చెప్పడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నర ఏళ్లు గడుస్తున్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని చెబుతూ అందుకు  కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణమని అరుణ ఆరోపించారు.

అవినీతికి పాల్పడితే సొంత బిడ్డను కూడా విడిచిపెట్టనని స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు తన కూతురు విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని ఆమె  ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి గురించి సీఎం కేసీఆర్ గొప్పగా మాట్లాడుతున్నారని, దీనిని బట్టి టీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతిని ఆయన ప్రోత్సహిస్తున్నట్టు అర్ధమవుతోందని ఆమె ఎద్దేవా చేశారు.