ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. 2014-19లో జరిగిన కుంభకోణంపై ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ ఈ మేరకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మొత్తం 26 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
రూ. 234 కోట్ల నిధుల మళ్లింపుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. పలు షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించారు. మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్‍కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం హైదరాబాద్‌లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
చంద్రబాబు నాయుడు హయాంలో, ఆయన కుమారుడు నారా లోకేష్ ఐటీ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ కుంభకోణం జరిగిన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని భావించిన జగన్ సర్కార్ సీఐడీకి విచారణను అప్పగిస్తూ గత ఏడాది ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఏపీఎస్‌ఎస్‌డిసి చైర్మన్ కె అజయ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సిఐడి 2021 డిసెంబర్ 9వ తేదీన కేసు నమోదు చేసింది. కాగా ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన సీఐడీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ కుంభకోణంపై తాజాగా దృష్టి సారించి న ఈడీ అధికారులు వివిధ కంపెనీలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 మందికి నోటీసులు జారీ చేశారు.
నకిలీ ఇన్వాయిస్‌లతో నిధులు మళ్లింపు చోటు చేసుకుందని వెల్లడైంది. ఢిల్లీకి చెందిన విపిన్ శర్మ, నీలం శర్మదంపతులు కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో ఇన్ వెబ్ సర్వీసెస్ అనే ఓ షెల్ కంపెనీని నిర్వహిస్తున్నట్లు, ఏపీఎస్‌ఎస్‌డిసి నిబంధనలకు విరుద్ధంగా సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలకు నిధులు చెల్లించింది.
ఈ నిధులను సీమెన్స్, డిజైన్ టెక్ వివిధ షెల్ కంపెనీల రూపంలో దారి మళ్లించాయి. ఈ క్రమంలో పూణేకు చెందిన స్కిల్లర్ అనే షెల్ కంపెనీ ద్వారా నకిలీ ఇన్వాయిస్‌లతో నిధులు కొల్లగొట్టిన ట్లు సిఐడి విచారణలో వెలుగు చూసింది.
అప్పటి ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ప్రభుత్వం తరఫున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలుపుకుని రూ.371 కోట్ల నిధులను సీమెన్స్‌ఇండియా, డిజైన్ టెక్‌లకు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కుంభకోణంలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి అప్పట్లో డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు.
ఈ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న సీమెన్స్ కంపెనీ కమిటీలో సభ్యుడైన జీవీఎస్ భాస్కర్ భార్య అపర్ణ ఉపాధ్యాయను డిప్యూటీ సీఈఓగా నియమించారు. ఈమె నియామకం నిబంధనలకు విరుద్ధంగా సిఐడి గుర్తించింది. అదేవిధంగా సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్‌ల నుంచి బ్యాంకు గ్యారంటీ కూడా లేదని విచారణలో తేలింది.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
ఏపీ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు