మెట్లపై నుంచి జారిపడిన పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారిపడినట్టు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. గత వారం జరిగిన ఈ అనూహ్య ఘటనలో మెట్లు దిగుతుండగా ఐదు మెట్ల వరకు జారారని తెలిపింది. దీంతో 70 పుతిన్‌ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొన్నది. దీనికారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తన కథనంలో తెలిపింది. అయితే దీనిపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పుతిన్‌ ఉదర, పేగు సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతుండటమే అనియంత్రిత మలవిసర్జనకు కారణమని వెల్లడించింది. తాజా పరిణామంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం గురించి మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి. ఉక్రెయిన్‌పై గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం గురించి రకరకాల వదంతులు వ్యాప్తిలోకి వస్తున్నాయి.
ఆయన చేతులు తరచూ వణుకుతున్నాయని, సరిగా నడవలేకపోతున్నారని, రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత నెల క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్ కనాల్‌తో సమావేశం సందర్భంగా పుతిన్ చేతులు వణకడంతో పాటు ఊదారంగులోకి మారిపోయినట్టు కనిపించాయని బ్రిటన్ పత్రిక ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
ఆయన కాళ్లు కదపలేక పోతున్నారని, సరిగా నడవలేకపోతున్నారని పేర్కొంది. 70 ఏళ్ల పుతిన్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారని, ఇది ఉక్రెయిన్‌లో ఏమి జరుగుతుందో దాని ఫలితమని మాజీ బ్రిటిష్ గూఢచారి ఇటీవల వ్యాఖ్యానించారు.
రష్యా అధినేతతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒలిగార్చ్ ‘బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పుతిన్ చాలా అనారోగ్యంతో ఉన్నాడని పేర్కొన్నారు. అయితే, పుతిన్ అనారోగ్యం గురించి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. 2014లో పుతిన్ ప్రతినిధి తమ నాయకుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించినట్టు అమెరికా మీడియా నివేదికలు వచ్చాయి.