2024 ఎన్నికల్లో బిజెపి 400 సీట్లు గెలుస్తుంది

ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్ సభ ఎన్నికలకు ఓ సూచిక అని చెబుతూ, 2024లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని  అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆయన అహ్మదాబాద్ లో మాట్లాడుతూ  నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టే ప్రక్రియ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పారు. 
 
తన ప్రియురాలిని గొంతు కోసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి చంపిన అఫ్తాబ్ పూనావాలా వంటి వ్యక్తులు లవ్ జిహాద్‌ను నిర్వహించే పర్యావరణ వ్యవస్థను దేశంలో ఇచ్చిందని హిమంత శర్మ ధ్వజమెత్తారు. దేశానికి ‘లవ్-జిహాద్’ చట్టం అవసరం అని స్పష్టం చేశారు.  అదే విధంగా ఉమ్మడి పౌరస్మృతి పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన ఉందని ఆయన చెప్పారు. మహిళలపై జవహర్‌లాల్ నెహ్రూ చేసిన అన్యాయం యూసీసీతో ముగుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బుజ్జగింపు రాజకీయాలు చేయడం వల్లే ఉగ్రవాదం విజృంభించిందని ఆయన ఆరోపించారు.
 
అయితే 2014 తర్వాత దానికి తగిన సమాధానం లభించిందని ఆయన పేర్కొన్నారు. పిఎఫ్ఐపై నిషేధం గురించి ప్రస్తావిస్తూ ఆ విధంగా చేయడం దేశాన్ని అస్థిరపరుస్తుందని కొందరు చెప్పారని, కానీ ఆ విధంగా ఏమీ జరగలేదని ఎద్దేవా చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా అదే చెప్పారని, కానీ ఏమీ జరగలేదని గుర్తు చేశారు.
 
యాంటీ-రాడిక్లేజియేషన్ యూనిట్ గురించి ప్రస్తావించిన బిజెపి మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతూ, ఇది వ్యాక్సిన్‌గా పని చేస్తుందని, వారు సమస్య  ప్రారంభం కాక ముందే ముగిస్తారని శర్మ చెప్పారు. హిందూ పోలరైజేషన్‌లో పాల్గొంటున్నారనే ఆరోపణలపై శర్మ, “హిందువులను పోలరైజ్ చేయడంలో సమస్య ఏమిటి? ఒవైసీ మాత్రమే మాట్లాడగలరా? హిందువులకు తమ ఘనతను వివరించే హక్కు లేదా?” అని ప్రశ్నించారు.
 
ముస్లిం ప్రజలు కూడా హిందువుల గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందుతారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ బుజ్జగింపు విధానం వల్లే అఫ్తాబ్-శ్రద్ధా వంటి కేసులు తెరపైకి వస్తున్నాయని  శ్రద్ధా వాకర్ కేసు గురించి చెబుతూ ఎవరైనా 35 ముక్కలుగా నరికితే అది ప్రేమకు సంబంధించిన విషయం అవుతుందా? అని విస్మయం వ్యక్తం చేశారు.
 
 కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే గుజరాత్ పర్యటనపై శర్మ మాట్లాడుతూ, ఆయన గుజరాత్‌కు రావడం మంచి విషయమని చెప్పారు.  “వాళ్ళకి తిరగాలి. నేను 22 ఏళ్లు కాంగ్రెస్‌లో ఉన్నాను. కానీ గాంధీ కుటుంబం తప్ప వేరే పేరు వినలేదు” అని ఎద్దేవా చేశారు.