ప్రపంచ రికార్డు సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్

టీమిండియా యువ బ్యాటర్, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న పూణే కుర్రాడు రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సిక్సర్ల మోత మోగించాడు.  క్రికెట్ చరిత్రలో మరో కనీవినీ ఎరుగని రికార్డును న‌మోదు చేశారు.
 
ఈ మ్యాచ్‌లో మొత్తం 159 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 10 ఫోర్లు, 16 సిక్సర్లతో అజేయంగా 220 పరుగులు చేశాడు. అతని బాదుడుతో మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. కాగా, 16 సిక్సర్లు బాదిన గైక్వాడ్ లిస్ట్ ఎ మ్యాచ్‌లో 16 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ రికార్డును అందుకున్నాడు.
 
గ‌తంలో అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా మరికొందరు ఆటగాళ్లు ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదారు. అంతకుముందు టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి 1985లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు.
 
ఆ మ్యాచ్‌లో బొంబాయికి ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి బరోడాతో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ తిలక్‌రాజ్ బౌలింగును ఉతికి ఆరేశాడు. వరుసగా ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపి రికార్డు సృష్టించాడు. అయితే, వీరిందరికీ భిన్నంగా టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు.
 
విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌లో రుతురాజ్ చెలరేగిపోయాడు. శివసింగ్ బౌలింగ్‌లో వరుసగా ఏడు సిక్సర్లు బాదాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 43 పరుగులు లభించాయి.
 
వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ స్టాండ్స్‌లోకి పంపాడు. నోబాల్ అయిన ఐదో బంతిని కూడా సిక్స్ కొట్టాడు. దీంతో అదనంగా లభించిన ఫ్రీహిట్ బంతితోపాటు చివరి బంతిని కూడా సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్‌లో రుతురాజ్ ఏకంగా 42 పరుగులు పిండుకున్నాడు.
 
నో బాల్‌కు లభించిన పరుగుతో కలిపి ఆ ఓవర్‌లో మొత్తం 43 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్‌లో ఏఢు సిక్సర్లు బాదిన రుతురాజ్.. ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.