ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు

“దేశంలో ఉగ్రవాద కార్యాకలాపాలు కూడా పెరిగాయి. ఉగ్రవాదాన్ని టార్గెట్ చేయమని చెప్పాం. కానీ వారు నన్ను మాత్రమే టార్గెట్ చేశారు. అందువల్ల దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగాయి” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, ఆప్ లపై మండిపడ్డారు.  గుజరాత్ ఎన్నికల ప్రచార సభలలో మాట్లాడుతూ  తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్లు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే ఉగ్రవాదాన్ని లక్ష్యం చేసుకోకుండా తనను టార్గెట్ చేశారని మోదీ ఆరోపించారు.
 
ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ తన ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని ధ్వజమెత్తారు. బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారని ప్రధాని గుర్తు చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా మొసలి కన్నీరు కార్చారని చెప్పారు.  అనేక ఇతర పార్టీలు కూడా సంతుష్టీకరణ చర్యలకు పాల్పడ్డాయని చెప్పారు.
 
ఆదివారం ఖేడాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించి,  ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్‌ని మాత్రం ప్రశ్నిస్తోందని అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బిజెపి  ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
 
“2014లో మీరు వేసిన ఒక్క ఓటు.. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో పెద్ద పాత్రను పోషించింది” అని ప్రధాని తెలిపారు. ఇప్పుడు ఉగ్రవాదులు మన సరిహద్దుల్లో దాడులు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారని చెప్పారు. నేడు గుజరాత్ లో 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగలిగామని మోదీ చెప్పారు. కేంద్రంతో పాటు గుజరాత్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండటం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్లతో ఉగ్రవాదాన్ని సమర్థంగా అడ్డుకోవచ్చని ప్రధాని స్పష్టం చేశారు.
 
కొన్ని పార్టీలు షార్ట్ కట్స్‌ని నమ్ముకుంటున్నాయని… బుజ్జగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలను అనుసరిస్తున్నాయని పరోక్షంగా ఆమాద్మీ పార్టీపై సెటైర్లు వేశారు. అందువల్లే ఉగ్రవాదం విషయంలో మౌనంగా ఉంటున్నాయని దుయ్యబట్టారు. కొందరు సానుభూతి దొడ్డి దారిలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నారని.. అలాంటి పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించారు.