జనాభా నియంత్రణ దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు

దేశంలో జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ జనాభా పెరిగిపోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని , జనాభా పెరిగిపోవడం వల్లే సమతౌల్యం దెబ్బతింటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. దీన్ని నియంత్రించడానికి తక్షణ కార్యాచరణ ప్రణాళికలను చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ దిశగా తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు.
 
ఇందులో భాగంగా జనాభా నియంత్రణ బిల్లును రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.వచ్చే ఏడాది నాటికి దేశ జనాభా భారీగా పెరగబోతోందని, ఈ విషయంలో చైనాను సైతం అధిగమిస్తుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరో ఏడాది కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందంటూ వెలువడిన అంచనాలపై ఆయన మాట్లాడారు.
 
జనాభా పెరుగుదల వల్ల మతపరమైన అసమతౌల్యం ఏర్పడే అవకాశం లేకపోలేదని గిరిరాజ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పించేలా చర్యలు చేపట్టాల్సి ఉందని చెబుతూ రజలకు అవగాహన కలిగించినప్పుడే జనాభా నియంత్రణ బిల్లు ఉద్దేశం నెరవేరుతుందని ఆయన చెప్పారు.
 
భవిష్యత్తులో దేశంలో జనాభా నియంత్రణ బిల్లు అత్యంత కీలకంగా మారుతుందని గిరిరాజ్ సింగ్ జోస్యం చెప్పారు. అన్ని మతాల వారికీ సమానంగా ఈ బిల్లును వర్తింపజేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
 
జనాభా నియంత్రణ వంటి కఠిన చట్టం, విధానాలను అమలు చేయడంలో చైనా విజయం సాధించిందని గిరిరాజ్ సింగ్ గుర్తు చేశారు. చైనా ప్రభుత్వం వన్ ఛైల్డ్ పాలసీని విజయవంతంగా అమలు చేసిందని చెబుతూ చైనాలో ప్రతి నిమిషానికి 10 మంది పిల్లలు పుడుతుంటే.. భారత్‌లో ఈ సంఖ్య 30గా ఉందని చెప్పారు.

జనాభా నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో, దాన్ని అంతే కఠినంగా అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ బిల్లులో పొందుపరిచే నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని వారికి సంక్షేమ పథకాల లబ్దిని తొలగించాలని ఆయన సూచించారు. అలాంటి వారు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోని విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
 
ఇలా ఉండగా, గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ కూడా ఇటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో దీనిపై మాట్లాడుతూ దేశంలో మతపరమైన అసమానతలు భారీగా పెరిగిపోయాయని, ఈ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.