కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చెదరగొట్టడం కోసం పలుచోట్ల పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.
దాంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ‘జిన్ పింగ్ స్టెప్ డౌన్.. కమ్యూనిస్ట్ పార్టీ స్టెప్ డౌన్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత గురువారం వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోగల ఉరుమ్‌కీలో ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయడంవల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేక, శ్వాస తీసుకోలేక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఈ ఘటన ఆజ్యం పోసింది.
కరోనా ఆంక్షల కారణంగానే ఇటీవల అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, మంటలను అదుపు చేయడంలో సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని, అందువల్ల మంటలు తగ్గుముఖం పట్టడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడం వల్ల లోపలున్న వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వారు వ్యక్తం చేశారు.
అయితే, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి ఆంక్షలు అమలులో లేవని చెప్పారు. కానీ, అగ్నిప్రమాదం జరిగిన షింజియాంగ్ ప్రాంతంలో గత 110 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఉరుమ్‌కీలోని 40 లక్షల మంది దాదాపు నాలుగు నెలలుగా ఇండ్లకే పరిమితమయ్యారు.
ఆందోళన కారుల్ని చెదగొట్టేందుకు బాష్పవాయువు, పెప్పర్ స్ప్రే వంటి చర్యలు చేపట్టడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. షాంఘైలో జరిగిన నిరసనల్లో దాదాపు 300 మంది పాల్గొన్నారు. షీజిన్‌పింగ్ స్టెప్‌డౌన్.. కమ్యూనిస్టు పార్టీ స్టెప్‌డౌన్.. అన్‌లాక్ షింజియాంగ్.. అన్‌లాక్ చైనా..డునాట్ వాంట్ పీసీఆర్ టెస్ట్ అని నినదిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
మరోవైపు ఆందోళనలకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాల నుంచి ప్రభుత్వం తొలగించి వేస్తుంది. షింజియాంగ్‌లో మూడు నెలలుగా కఠిన లాక్‌డౌన్ అమలవుతోంది. ఆందోళనలు తారాస్థాయికి చేరడంతో ఉరుమ్‌కీలో కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల నంచి ప్రభుత్వం పాక్షిక మినహాయింపుల్ని ఇచ్చింది. సోమవారం నుంచి రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తామని తెలిపింది.
కాగా, చైనాలో రోజుకు సగటున 40 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. మూడు నెలల నుంచి ఇండ్లకే పరిమితమై ఉన్నామని, ఇకనైనా లాక్ డౌన్ తీసేయాలంటూ చైనా ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ చైనాలో కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా 5,232 మంది చనిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కనుమరుగు అవుతున్న క్రమంల, చైనాలో కేసులు విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కరోనా విధానం అక్కడి ప్రజలకు విసుగు పుట్టించింది.
కొన్నినెలల కిందటే షాంఘైలో దాదాపు 25 లక్షల మందిని లాక్‌డౌన్‌లో ఉంచారు. అప్పటి నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. క్రమంగా మిగతా రాష్ట్రాలకూ విస్తరిస్తున్నాయి.. ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మహమ్మారి ప్రారంభ వారాల నుండి వచ్చే కొన్ని వారాలు చైనా దారుణంగా దెబ్బ తినవచ్చని క్యాపిటల్ ఎకనామిక్స్‌కు చెందిన మార్క్ విలియమ్స్ గత వారం నోట్‌లో తెలిపారు.
వాయువ్య నగరమైన లాన్‌జౌలో, నివాసితులు శనివారం కరోనా సిబ్బంది గుడారాలను కూల్చివేసి ధ్వంసం చేశారు. టెస్టింగ్ బూత్‌లు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చూపించారు. ఎవరూ పాజిటివ్‌గా నిర్ధారణ కానప్పటికీ తమను లాక్‌డౌన్‌లో ఉంచినట్లు నిరసనకారులు తెలిపారు. ఉరుంకి బాధితుల కోసం నాన్‌జింగ్ మరియు బీజింగ్‌తో సహా నగరాల్లోని విశ్వవిద్యాలయాలలో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి.
More Stories
మాస్కోలో సిరియా అధ్యక్షుడు అసద్‌కు రష్యా ఆశ్రయం
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు