సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని తెలిపింది.

ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన బహిరంగ సభ కూడా భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో జరుపుకోవాలని న్యాయస్థానం సూచించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య మాత్రమే సభ జరుపుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మంది తో మాత్రమే పాదయాత్ర  చేయాలని, 3 వేల మందితోనే సభ జరుపుకోవాలని హైకోర్టు నిర్దేశించింది.

బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించింది. కార్యకర్తలు కర్రలు, వెపన్స్ వాడొద్దని తెలిపింది. లా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడాలని ఆదేశించింది. 

భద్రతా కారణాల పేరుతో పోలీసులు బండి పాదయాత్రకు ఒక్కరోజు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు అనుమతించేలా ఆదేశించాలని కోరింది. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్ర కొనసాగించేందుకు ఈ మేరకు అనుమతిచ్చింది.

హైకోర్టు సూచనల మేరకు సభ, పాదయాత్రను రీషెడ్యూల్ చేశారు. న్యాయస్థానం సూచనల మేరకు సభ నిర్వహణ, పాదయాత్ర ప్రారంభానికి సమయం లేకపోవడంతో చివరకు బహిరంగ సభతో పాటు పాదయాత్రను మంగళవారం  ప్రారంభించాలని నిర్ణయించారు.  సోమవారం సంజయ్ లాంచనంగా పాదయాత్రను ప్రారంభిస్తారు.

కరీంనగర్ నుండి నిర్మల్ కు బయలుదేరి, నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని, ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు జరుపుతారు.  అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం అక్కడి నుండే పాదయాత్రను ప్రారంభిస్తారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం భారీ బహిరంగ సభ జరుపుతారు.  బహిరంగ సభకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హాజరవుతారు.

.