టైవాన్ లో రాజకీయ సంక్షోభం.. పార్టీ అధ్యక్ష పదవికి అధ్యక్షురాలు రాజీనామా

దేశవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనా వ్యతిరేక ప్రచారాన్నే ప్రధాన అజెండాగా చేసుకున్న అధికార పార్టీ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డిపిపి)కి తైవాన్ లో ఘోర పరాజయం ఎదురైంది. దీంతో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో తైవాన్‌ అధ్యక్షురాలు సాయి ఇంగ్‌ వెన్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
 
స్థానిక ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురు కావడంతో సంప్రదాయం ప్రకారం ఆమె తన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నాటి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని ఆమె స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికలే అయినప్పటికీ వీటిని ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
‘ప్రపంచం చూస్తోంది..’ అంటూ చైనా వ్యతిరేక ప్రచారాన్ని భారీగా నిర్వహించారు. తైవాన్‌ ప్రజలు చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అది ఏ స్థాయిలో ఉందో ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రపంచం చూస్తుందని ఆమె పదేపదే చెప్పారు.  దీనికి భిన్నంగా ప్రతిపక్షలో ఉన్న కొమింటాంగ్‌ పార్టీ (కెఎంటి) చైనాతో డిపిపి ప్రభుత్వ వైరం శ్రుతి మించుతోందని, ఇది దేశానికి ప్రమాదమని ఎన్నికల ప్రచారంలో చెప్పింది.
సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే తమ విధానమని, అదే సమయంలో చైనాకు కొమ్ముకాయబోమని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో ప్రజానీకం కెఎంటి వైపు స్పష్టమైన మొగ్గు చూపారు. 21 నగర మేయర్‌ స్థానాలకు ఎన్నికలు జరగగా పదమూడింటిని కెఎంటి కైవసం చేసుకుంది. వీటిలో తైవాన్‌ రాజధాని నగరం తైపే కూడా ఉంది. మిగిలిన స్థానాల్లో కూడా అధికారపార్టీకి బొటాబొటీ మెజార్టీ మాత్రమే లభించింది.
 
నేషనల్ పార్టీ మేయర్ అభ్యర్థి చియాంగ్ వాన్ ఇన్ రాజధాని తైపేలో విజయం సాధించారు. తయోయుయాన్, తైచుంగ్, న్యూ తైపే సిటీల్లో కూడా మేయర్ స్థానాలను నేషనల్ పార్టీ అభ్యర్థులే దక్కించుకోగలిగారు. స్హించు మేయర్ పీఠాన్ని తైవాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి కవో హుంగ్ యన్ గెలుచుకున్నారు. 13 కౌంటీలు, 9 సిటీలకు మేయర్లు, కౌన్సిలు సభ్యులు, ఇతర స్తానిక నాయకులు ఎన్నికయ్యారు.
 
ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేసిన తైవాన్‌ అధ్యక్షరాలు తమ విధానాలను ప్రజలు ఆమోదించలేదని చెప్పారు. చైనా నుంచి బెదిరింపులపై తలెత్తిన ఆందోళనలే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.