ఢిల్లీ లిక్కర్ స్కాంలో 3,000 పేజీలతో ఈడీ ఛార్జ్ షీట్

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిబిఐ 10,000 పేజీల మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన మరుసటి రోజుననే  మనీ లాండరింగ్ కేసులో ఈడీ తొలి ఛార్జ్ షీట్ ను శనివారం దాఖలు చేసింది. ఈ కేసులో వ్యాపారవేత్త సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసి 60 రోజులు అవుతున్న క్రమంలో ఈడీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది.

అందులో సమీర్ మహేంద్రును ఏ1గా పేర్కొంది. ఏ2, ఏ3, ఏ4, ఏ5గా 4 కంపెనీల పేర్లు చేర్చింది. రౌస్ అవెన్యూ కోర్టులో దాదాపు 3వేల పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ సాఫ్ట్ కాపీతో కూడిన హార్డ్ డిస్క్ సహా డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది.

కాగా ఈ కేసులో ఇదే తొలి ఛార్జ్ షీట్. ఇక మిగతా నిందితులపై కూడా త్వరలో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్టు ఈడీ తెలిపింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అందులో ఒకరు సమీర్ మహేంద్రు కాగా శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ గా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది.

మరోవైపు ఈ కేసులో సీబీఐ ఏడుగురిపై అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది. ఆప్ నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో సహా మరికొందరి పేర్లు ఇందులో చేర్చినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో మిగతా వారు ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది.  ఇక మనీష్ సిసోడియా పేరును కూడా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. అయితే ప్రస్తుతం మనీష్ సిసోడియాను విచారిస్తున్న నేపథ్యంలో సిబిఐ మనీష్ సిసోడియా పేరును చేర్చలేదని తెలుస్తుంది.