భారత్ నుండి అందుకున్న బంగారు పతాకం అమ్ముకున్న ఇమ్రాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే రోజుల్లో భారత్‌ నుంచి అందుకున్న బంగారు పతకాన్ని అమ్ముకున్నారని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌  సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఆ బంగారు పతకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన చెప్పలేదు.

కాగా, 1987లో ఇమ్రాన్‌కు భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని మాజీ ప్రధాని నుంచి తాను కొనుగోలు చేశానని లాహోర్‌కు చెందిన షకీల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ‘నాకు నాణేలు సేకరించడం హాబీ. ఇందులో భాగంగా ఇమ్రాన్ ఖాన్ అందుకున్న బంగారు పతకంతో పాటు మొత్తం ఆరు పతకాలను 2014లో రూ.3 వేలకు కొనుగోలు చేశా’ అని వెల్లడించారు.

ఆ పతకాలను తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు డొనేట్ చేశానని, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీపీబీ) తాను ఇచ్చిన విరాళాలను అంగీకరించి తనకు సర్టిఫికెట్ కూడా అందించిందని షకీల్ వివరించారు. ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుండి వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి.

ప్రధానిగా ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి అందుకున్న ఖరీదైన వాచీలు, ఇతర బహుమతులను ఇమ్రాన్‌ అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆ దేశ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై అప్పట్లో ఇమ్రాన్‌ సైతం స్పందించారు. ‘నా బహుమతులు.. నా ఇష్టం’ అంటూ విమర్శకులకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. తాజాగా మరోసారి అలాంటి ఆరోపణలే పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేయడం గమనార్హం.

1987లో భారత్ లో పర్యటించిన పాకిస్థాన్ టీమ్ ముంబైలో భారత జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ప్లేయర్ అబ్దుల్ ఖాదిర్ గాయపడగా.. సబిస్టిట్యూట్ ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేశారు. ఈ మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు ముంబై క్రికెట్ క్లబ్ ఓ బంగారు పతకాన్ని బహూకరించింది. ఈ పతకాన్ని ఇమ్రాన్ అమ్ముకున్నాడని తాజాగా పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ ఆరోపించారు.