చిరుకు ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యుత్తమ పురస్కారం దక్కింది. ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు ఆయన వరించింది. ఆదివారం  గోవాలోప్రారంభమైన  53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో  కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. 
 
సినీ పరిశ్రమకు చిరు అందించిన విశేష సేవలకు గానూ ఆయనను ఈ అవార్డు వరించింది. కాగా, ఇప్పటి వరకూ ఈ అవార్డును అమితాబ్‌, సలీమ్‌ఖాన్‌, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్‌ జోషి, వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు.
 
అద్బుతమైన నటనతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ప్రజాదరణ పొందారు. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన చిరంజీవిగారికి శుభాకాంక్షలు అని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ ట్వీట్ చేశారు.
భారతీయ చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ అవార్డు ప్రదానం చేస్తున్నారు.
ఈ పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ. 10 లక్షలతో పాటు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. 
ఇక చిరు హీరోగా 150కు పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగానూ ఆయన ఎన్నో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఆయన ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్‌’ మూవీస్ లో నటిస్తున్నారు.
28వరకు చలన చిత్రత్సోవాలు కొనసాగనున్నాయి. పనాజీ సమీపంలోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మొదలైంది.తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ ఈవెంట్‌లో 79 దేశాల నుంచి మొత్తం 280 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో 25 ఫీచర్ సినిమాలు, 20 నాన్-ఫీచర్ సినిమాలు ప్రదర్శించనున్నారు.