పరిహార నిధిపై తుది నిర్ణయం వచ్చే ఏడాదికి కాప్‌27 వాయిదా!

వాతావరణ మార్పుల కారణంగా నష్టపోతున్న దేశాలకు పరిహార నిధిని (లాస్‌ అండ్‌ డ్యామేజి ఫైనాన్స్‌ ఫెసిలిటీ) ఒక ప్రతిపాదనగా ఒప్పంద ముసాయిదాలో చేర్చడానికి కాప్‌27లో అంగీకారం కుదిరింది. శనివారం సాయంత్రం వరకు జరిగిన చర్చల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఈ మేరకు అంగీకరించాయి. అయితే, వివరాలపై వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 
 
దీంతో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ మేరకు ముసాయిదా కాపీని అధ్యక్షవర్గం విడుదల చేసింది. ‘లాస్‌ అండ్‌ డ్యామేజి ఫైనాన్స్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి షర్మ్‌ ఎల్‌ షేక్‌ లో జరిగిన సమావేశంలో ప్రతిపాదిస్తున్నాం. ఇతర అంశాలను తరువాత నిర్ణయిస్తారు’ అని ముసాయిదాలో పేర్కొన్నారు. 
 
ముసాయిదాలో ఈ అంశానిు చేర్చడం అభివృద్ధి చెందుతును దేశాల డిమాండ్‌కు అనుగుణంగా కనపడుతునుప్పటికీ ఆచరణలోకి రావడం మాత్రం అభివృద్ధి చెందిన దేశాల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. వచ్చే ఏడాది నవంబర్‌-డిసెంబర్‌ నెలల్లో జరగనున్న కాప్‌-28లో దీనిపై మరోసారి చర్చించనున్నారు. 
 
ఆ సమావేశంలో నిధిని ఎంత మొత్తంతో ఏర్పాటు చేయాలి? పరిహారాన్ని చెల్లించడానికి నిబంధనలేంటి? అను అంశాలను చర్చించనున్నారు. దీంతో ఏ దశలోనైనా దీనిని తిప్పి కొట్టే అవకాశం ధనిక దేశాల చేతుల్లో ఉంది.  నిజానికి, కాప్‌ 27 సమావేశం శుక్రవారం సాయంత్రమే ముగియాల్సి ఉంది. అయితే, వాతావరణ నష్టాల పరిహార అంశం తేలకపోవడంతో చర్చలు కొనసాగాయి. శుక్రవారం రాత్రంతా కూడా ఈ అంశంపైనే చర్చలు జరిగాయి. 
 
యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు ‘అరకొరగా అనుకునే దాని కన్నా అసలు ఒప్పందం చేయక పోవడమే మంచిది’ అని వాదించారు. కర్బన కాలుష్యానికి అధికంగా కారణమవుతున్న దేశాలన్ని పరిహారం చెల్లింపునకు బాధ్యత తీసుకోవాలని యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధులు వాదించారు. 
 
దీనిని ప్రాతిపదికగా తీసుకుంటే భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న  దేశాలు కూడా ఆ జాబితాలోకి రానుండటంతో సమావేశంలో ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు, శనివారం మధ్యాహ్నం తర్వాత ముసాయిదాలో ఆ అంశాన్ని  చేర్చడానికి ధనిక దేశాలు అంగీకరించాయి. అదే సమయంలో భారత్‌ లేవనెత్తిన శిలాజ ఇంధనాల అంశాన్ని మాత్రం ముసాయిదాలో చేర్చలేదు.
కాగా, వాతావరణ లక్ష్యాలను సాధించడానికి సభ్య దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని కాప్‌27 అధ్యక్షుడు సమిర్‌ షౌర్కే చెప్పారు.  ‘మేం చేయగలిగినంతా చేశాం. అన్ని విధాల సానుకూల ఫలితం వస్తుందని ఆశించాం. కానీ, ఒప్పందం కుదుర్చుకోవాలని ఎవరినీ ఒత్తిడి చేయలేం. చర్చలు జరగడం కూడా మంచిదే?’ అని తెలిపారు.