నష్ట పరిహార నిధిపై కాప్‌ 27 సదస్సులో ప్రతిష్టంభన

గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో విపత్తులను ఎదుర్కొంటును వర్ధమాన దేశాల కోసం వాతావరణ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయడంపై ప్రతిష్టంభన నెలకొనడంతో కాప్‌ 27 సదస్సును శనివారం వరకూ పొడిగించారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారంతో సదస్సు ముగియాల్సి ఉంది.
దాదాపు 200 దేశాలకు చెందిన ప్రతినిధులు రెండు వారాల పాటు షర్మ్‌ ఎల్‌ షేక్‌ (ఈజిప్ట్‌)లో   సమావేశమై, వాతావరణ మార్పులపై చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందించే లక్ష్యంతో చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావాలను అనుభవిస్తున్నాయి. విపరీతంగా వర్షాలు, వరదలు, వడగాలులు, కరువు కాటకాలు సంభవిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లో పడేస్తున్నాయి.
సంపను దేశాలు వెలువరించే కాలుష్య కారకాల వల్ల పేద, వర్ధమాన దేశాలు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో, సంపన్న దేశాలు నష్టపరిహారం ఇవ్వాలను అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. నష్ట పరిహార నిధి ఏర్పాటుపై ఉమ్మడి ప్రాతిపదిక కోసం సంపను, వర్ధమాన దేశాలు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి.
వీటితోపాటు పలు కీలకమైన అంశాలపైనా ఒక అభిప్రాయానికి రావాల్సి వుంది. సమయం మించిపోతునుందున మనం మరింత వేగంగా వ్యవహరించాల్సి వుందని ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి సామేహ్ షౌక్రీ ప్రతినిధులతో పేర్కొన్నారు. 1.5 డిగ్రీల సెల్సియస్‌కుసగటు ఉష్ణోగ్రతలను పరిమితం చేసేందుకు కాలుష్య ఉద్గారాల్లో కోతపై ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి వుంది.
నిధి ఏర్పాటుపై కూడా అంగీకారానికి రావాల్సి వుంది. పెరుగుతున్న గ్లోబల్‌ వార్మింగ్‌తో సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదాన్ని పలు చిన్న దీవుల దేశాలు ఎదుర్కొంటున్నాయి. అత్యంత ప్రమాదాన్ని, హానిని ఎదుర్కొనే దేశాల కోసం నిధిని ఏర్పాటు చేయాలని గురువారం పొద్దుపోయిన తర్వాత యురోపియన్‌ యూనియన్‌ ప్రతిపాదించింది.
అందరి కళ్లూ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రధాన కాలుష్య కారక దేశాలైన అమెరికా, చైనాపైనే వున్నాయని ప్రముఖ ఆర్థిక వేత్త రాచెల్‌ క్లీటస్‌ వ్యాఖ్యానించారు. సదస్సులో పక్కన కూర్చోవడానికి ఇక అమెరికాకు ఎంత మాత్రమూ సమయం లేదని ఆమె స్పష్టం చేశారు. తమ వైఖరి ఏమిటనేది వెల్లడించాలని, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నామని అమెరికా నిరూపించుకోవాల్సి వుంటుందని చెప్పారు.  నిధి ఏర్పాటుపై చైనా కూడా తమ వైఖరిని స్పష్టం చేయాల్సి ఉందన్నారు.