ప్రతి ధర్మాసనంలో ప్రతి రోజూ 10 బెయిల్ పిటిషన్లు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయ పాలనలో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడం కోసం సంస్కరణలు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్‌, ట్రాన్స్‌ఫ‌ర్ పిటిష‌న్ల‌పై సీజేఐ డీవై చంద్ర‌చూడ్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు.
ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో 13 బెంచ్‌లు ప‌నిచేస్తున్నాయ‌ని, ప్ర‌తి రోజు ఒక్కొక్క బెంచ్ ప‌ది బెయిల్ కేసులతో పాటు ట్రాన్స్‌ఫ‌ర్ పిటీష‌న్ల‌ను విచారించాల‌ని సీజేఐ పేర్కొన్నారు. ప్ర‌తి రోజు ఉద‌యం ఈ కేసుల విచార‌ణ‌ను చేప‌ట్టాల‌ని, పెండింగ్ కేసుల‌న్నీ డిసెంబ‌ర్‌లోని క్రిస్మ‌స్ సెల‌వుల లోపు పూర్తి చేయాలని సీజే తెలిపారు.
 
బెయిలు పిటిషన్లు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవి కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉందని చెప్పారు. వైవాహిక వివాదాలకు సంబంధించిన కేసుల్లో పార్టీలు తమకు నచ్చిన చోటుకు విచారణను బదిలీ చేయాలని కోరుతున్నాయని పేర్కొంటూ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్లు సుమారు 3,000 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 
 
ప్రతి ధర్మాసనం రోజుకు 10 ట్రాన్స్‌ఫర్ కేసులను చేపడితే, సుప్రీంకోర్టులోని మొత్తం 13 ధర్మాసనాలు రోజుకు 130 కేసులను, వారానికి 650 కేసులను పరిష్కరించగలుగుతాయని పేర్కొన్నారు. ఐదు వారాలు ముగిసే సరికి, అంటే శీతాకాలం సెలవులకు ముందు, అన్ని ట్రాన్స్‌ఫర్ పిటిషన్లపై విచారణ పూర్తవుతుందని చెప్పారు. 
 
ప్రతి ధర్మాసనం రోజుకు 20 (ట్రాన్స్‌ఫర్ + బెయిలు) కేసులపై విచారణ జరిపిన తర్వాత ఇతర రెగ్యులర్ కేసులను చేపడుతుందని సూచించారు. అనుబంధ జాబితాలో చిట్టచివరి క్షణంలో నమోదు చేసే కేసుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 
 
రాత్రి పొద్దుపోయే వరకు కేసు ఫైళ్ళను తప్పనిసరిగా చూడవలసిన పరిస్థితిని న్యాయమూర్తులు ఎదుర్కొనకూడదని, వారిపై అటువంటి భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో దీనికి సంబందించిన నిర్ణయం తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.