ఉగ్రవాదంపై స్పందించే తీరు ఒకే విధంగా ఉండాలి

ఉగ్రవాద దాడులు జరిగినపుడు స్పందించే తీరు ఒకే విధంగా ఉండాలని, ఆ దాడి ఎక్కడ జరిగిందనే అంశం ప్రాతిపదిక కాకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అన్ని ఉగ్రవాద దాడులపైనా సమానంగా ఆగ్రహం వ్యక్తంకావాలని, చర్యలు ఉండాలని తెలిపారు. ప్రపంచానికి ముప్పు కలిగించే అంశంపై వ్యవహరించడంలో సందిగ్ధ వైఖరికి చోటు ఉండకూడదని హితవు చెప్పారు.
ఉగ్రవాద నిరోధానికి నిధులను సమకూర్చడంపై మినిస్టీరియల్ కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ప్రపంచం గుర్తించడానికి ముందే దాని చీకటి కోణాన్ని మన దేశం చూసిందని పేర్కొన్నారు. ఉగ్రవాదం వేర్వేరు పేర్లతో, రూపాల్లో మన దేశాన్ని బాధించేందుకు అనేక దశాబ్దాల నుంచి ప్రయత్నిస్తోందని తెలిపారు.
అత్యంత విలువైన వేలాదిమందిని కోల్పోయామని, అయితే మనం ఉగ్రవాదంతో ధైర్యసాహసాలతో పోరాడుతున్నామని చెప్పారు. ఒక ఉగ్రవాద దాడి జరిగినా తాము తీవ్రంగా పరిగణిస్తామని చెబుతూ ఒక ప్రాణం పోయినా అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తామని చెప్పారు. ఉగ్రవాదం కూకటివేళ్ళు తెగిపోయే వరకు తాము విశ్రమించబోమని తెలిపారు.
పరోక్షంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లను ప్రస్తావిస్తూ, కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతిస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఈ దేశాలు ఉగ్రవాదులకు రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక మద్దతు పలుకుతున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి దేశాలు మూల్యం చెల్లించే విధంగా చేయాలని స్పష్టం చేశారు.
నిరంతరం ముప్పును ఎదుర్కొనే ప్రాంతాన్ని ఎవరూ ఇష్టపడరని మోదీ  చెప్పారు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వ్యవస్థల మూలాలను, కూకటివేళ్ళను తెగ్గొట్టాలని, ఇది చాలా ముఖ్యమని తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, కౌంటర్ టెర్రరిజం ఫైనాన్సింగ్, అదేవిధంగా ఉగ్రవాదం వల్ల ఉత్పన్నమవుతున్న సవాళ్ళపై స్పందించడంలో ప్రస్తుత అంతర్జాతీయ సమాజం సమర్థతపై చర్చించేందుకు భాగస్వామ్య దేశాలు, సంస్థలకు ప్రత్యేక వేదికగా ఈ సమావేశం ఉపయోగపడుతుందని తెలిపింది.
పారిస్ (2018 ఏప్రిల్), మెల్‌బోర్న్ (2019 నవంబరు)లలో జరిగిన సమావేశాల ఫలితాలు, అనుభవాల ఆధారంగా కృషి చేయడానికి ఈ సమావేశం దోహదపడుతుందని పేర్కొంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయాన్ని, కార్యకలాపాల నిర్వహణకు అనుమతులను నిరాకరించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది.
 
ఉగ్రవాద ప్రభావం దీర్ఘకాలంలో ముఖ్యంగాపేదలపై, స్థానిక ఆర్ధిక వనరులపై ఉంటుందని ప్రధాని చెప్పారు. పర్యాటకం కానీయండి, మరో వ్యాపారం కానీయండి తరచూ ఉగ్రవాద ప్రమాదమున్న ప్రాంతాలలో ఇష్టపడరని గుర్తు చేశారు. ఉగ్రవాదం కారణంగా ప్రజల జీవనోపాధి అవకాశాలు కోల్పోవలసి వస్తుందని చెబుతూ ఉగ్రవాద నిధులను వనరులను ప్రాధమిక స్థాయిలోనే కట్టడి చేయగలగాలని స్పష్టం చేశారు. 
ఉగ్రవాదికి, ఉగ్రవాదంకు మధ్య గల తేడాని ప్రస్తావిస్తూ ఆయుధాలు ఉపయోగించడమా, తక్షణం వ్యూహాత్మకంగా స్పందించడం ద్వారా ఓ ఉగ్రవాదిని కట్టడి చేయవచ్చని, అయితే ఆ విధంగా చేయడంతో లభించే ప్రయోజనాలు ఉగ్రవాదుల ఆర్ధిక వనరులను కట్టడి చేయకుండా ఉగ్రవాదంపై చేసే పోరాటంకు విస్తృతస్థాయి వ్యుహం అవసరమని ప్రధాని చెప్పారు. ఉగ్రవాది ఓ వ్యక్తి అయితే, ఉగ్రవాదం కొందరు వ్యక్తుల నెట్ వర్క్ అని మోదీ వివరించారు.