ఎల్పీజీ సిలిండ‌ర్ల‌పై క్యూఆర్ కోడ్స్

ఇక డొమెస్టిక్‌ఎల్పీజీ సిలిండ‌ర్ల‌పై క్యూఆర్ కోడ్స్ ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త‌మ‌ గ్యాస్ సిలిండ‌ర్లలో ఒక‌ట్రెండు కిలోల గ్యాస్ త‌క్కువ‌గా ఉంటోంద‌ని క‌స్ట‌మ‌ర్ల నుంచి త‌ర‌చూ ఫిర్యాదులు వ‌స్తున్న క్ర‌మంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.  గ్యాస్ చోరీని నివారించేందుకు ఎల్పీజీ సిలిండ‌ర్ల‌పై ప్ర‌భుత్వం త్వ‌ర‌లో క్యూఆర్ కోడ్స్‌ను పొందుప‌రుస్తుంద‌ని కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ వాయువు మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి ప్ర‌క‌టించారు.
ప్ర‌స్తుత సిలిండ‌ర్లు, నూత‌న సిలిండ‌ర్ల‌పై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తారు.  దీన్ని యాక్టివేట్ చేయ‌గానే గ్యాస్ చౌర్యం, సిలిండ‌ర్ల ఇన్వెంట‌రీ నిర్వ‌హ‌ణ‌, ట్రాకింగ్‌, ట్రేసింగ్ వంటి వివ‌రాలు తెలుస్తాయ‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ క్యూఆర్ కోడ్ వాడ‌టం ద్వారా సిలిండ‌ర్ల‌లో గ్యాస్ ప‌రిమాణం ట్రాక్ చేయ‌డం ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని మంత్రి వివ‌రించారు.
గ్యాస్ సిలిండ‌ర్‌పై క్యూఆర్ కోడ్‌తో మెట‌ల్ స్టిక్క‌ర్‌ను అమ‌ర్చుతారు. సిలిండ‌ర్ల‌లో గ్యాస్ త‌క్కువ‌గా ఉంటోంద‌ని వ‌చ్చే ఫిర్యాదుల‌ను క్యూఆర్ కోడ్ లేకుండా ప‌సిగ‌ట్టడం కష్ట‌త‌ర‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. సిలిండ‌ర్ల‌పై క్యూఆర్ కోడ్ ఉంటే ట్రేస్ చేయ‌డం సుల‌భ‌మవుతుంది.  క్యూఆర్ కోడ్ ద్వారా గ్యాస్ చౌర్యాన్ని అరిక‌ట్ట‌డంతో పాటు గ్యాస్ సిలిండ‌ర్‌ను ఏ డీల‌ర్ డెలివ‌రీ చేశారునే వివ‌రాల‌తో పాటు గృహ వినియోగ సిలిండ‌ర్‌ను ఎవ‌రూ వాణిజ్య సేవ‌ల‌కు వాడ‌కుండా కూడా నిరోధించ‌డం సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది.
ప్రపంచ ఎల్పీజీ వారోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. మొదటగా 20,000 సిలిండర్ లకు ఇటువంటి కోడ్ ను సమకూరుస్తున్నామని, క్రమంగా రాబోయే మూడు నెలల్లో అన్ని సీలిండర్లకు సమకూరుస్తామని చెబుతూ ఆయన ఈ పద్ధతిపై ఒక వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.