క్యాసినో కేసులో ఈడీ విచారణకు మంత్రి తలసాని సోదరులు

క్యాసినో కేసు విచారణలో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. బుధవారం ఈడీ ముందుకు మంత్రి తలసాని సోదరులు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్  హాజరయ్యారు.  ఉదయం 11 గంటల నుంచి  రాత్రి 9 గంటల వరకు.. దాదాపు 10 గంటల పాటు విచారణ జరిగింది. విదేశాల్లో క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై వారిని ఈడీ ప్రశ్నించింది.
 
ఫెమా ఉల్లంఘనలు, మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారింఛారు. కాగా  ఇప్పటికే  ఈ కేసులో చీకోటి ప్రవీణ్‌తో పాటు ఆయన సన్నిహితులను ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. అంతకుముందు చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.
 
నగర శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో చీకోటి ప్రవీణ్‌ చీకటి కొండచిలువలు, రామచిలకలు, గుర్రాలు, ఉడుములు, ఆస్ట్రిచ్‌, బాతుల్లాంటి వన్యప్రాణుల్ని చీకోటి ప్రవీణ్‌ పెంచుకుంటున్నట్లు తేలింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ ఇప్పటికే సోదాలు చేసింది. ఆలాగే ప్రవీణ్ ను నాలుగు రోజులపాటు విచారించింది. ఈ విచారణలో చికోటి ప్రవీణ్ లావాదేవీలపై కీలక సమాచారం లభించింది. ఆ లావాదేవీల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  సోదరుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. 
 
 గతంలో ప్రవీణ‌్‌తో కలిసి విదేశాలకు మహేష్, ధర్మేందర్ వెళ్లినట్లు చెబుతున్నారు. తలసాని శ్రీనివాస్‌‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు చీకోటి ప్రవీణ్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారనే విషయాన్ని ఈడీ ఇదివరకే గుర్తించింది.  మరోవైపు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్‌ వాట్సాప్‌ లో చాటింగ్‌ చేసినట్టు గుర్తించారు. ఈ చాట్‌ ఆధారంగా సదరు రాజకీయ నాయకులతో ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. 
 
ఈ మేరకు నేడు ఈడీ విచారణకు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్  హాజరయ్యారు. అయితే తలసాని మహేష్ కు, ధర్మేంద్ర యాదవ్ లకు ఈడీ నోటీసులు ఇచ్చిందని ఇప్పటి వరకు బయటకు రాలేదు. బుధవారం వారు ఈడీ ముందు హాజరు అవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది. మొత్తం వ్యాపారాలకు సంబంధించి 4 ఏళ్లలో జరిగిన ఆర్ధిక లావాదేవీలను తీసుకురావాలని ఈడీ ఆదేశించినట్లు సమాచారం అందుతుంది. అయితే వీరి వ్యాపారాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు భాగస్వామిగా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.
 
మంత్రికి ఈడీ నోటీసులు జారీ కాకపోవడంతో కేవలం ఆయన సోదరులకు సంబంధించి లావాదేవీలపై మాత్రమే ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలా ఉండగా,  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ,  మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ లకు గురువారం విచారణకు హాజరుకమ్మని నోటీసులు జారీ చేశారు.