అధ్యక్షుడు ఖర్గేను చుట్టుముడుతున్న సవాళ్లు 

సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ పార్టీ వ్యవహారాలపై ఆయనకు ఏమాత్రం పట్టు కనిపించడం లేదు. పార్టీ నాయకులు ఎవ్వరూ ఆయనతో కలసి వస్తున్నట్లు కనిపించడం లేదు. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌  గా వైదొలుగుతున్నట్లు సీనియర్ నేత అజయ్‌ మాకెన్‌ ప్రకటించారు.
 
మరోవంక, పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడిన శశి థరూర్ గుజరాత్ ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉంటున్నారు. తాజాగా గుజరాత్‌లో ప్రచారం నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్‌ విద్యార్థి సంఘం శశిథరూర్‌ను ఆహ్వానించింది. అయితే పార్టీ విడుదల చేసిన  స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో తన  పేరు లేనందన గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
 
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో.. సెప్టెంబర్ 25న నిర్వహించిన రాజస్థాన్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరు కాకుండా, పోటీ సమావేశం జరిపిన గెహ్లాట్ వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాను చేసిన సిఫార్సులను పట్టించుకొనక పోవడంతో అజయ్‌ మాకెన్‌  కినుక వహించిన్నట్లు తెలుస్తున్నది.  
 
మరోవంక, కాంగ్రెస్‌ అధ్యక్ష కార్యాలయ సమన్వయకర్తల నియామకం కూడా వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించిన కర్ణాటక ఎంపీ నసీర్‌ హుస్సేన్‌, అలాగే, రణదీప్‌ సూర్జేవాలా నేతృత్వంలో మీడియా విభాగాన్ని నిర్వహిస్తున్న ప్రణవ్‌ ఝా, రాజ్యసభ టీవీ బాధ్యతలు చూసిన గురుదీప్‌ సప్పల్‌, పంజాబ్‌ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా ఉన్న గౌరవ్‌ పంఢిలను సమన్వయకర్తలుగా నియమించడం చర్చనీయాంశంగా మారింది.
 
రాహుల్‌గాంధీ కార్యాలయంలోని కొందరికి సన్నిహితంగా ఉండటమే గౌరవ్‌ పంఢి నియామకానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, పంజాబ్‌ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా గురుదీప్‌ సప్పల్‌ను సమన్వయకర్తగా నియమించడం కూడా వివాదాస్పదంగా మారింది.దాంతో పార్టీ పునర్నిర్మాణంలో ఖర్గే పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
 
పార్టీ అధ్యక్షుడిగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఖర్గే పాల్గొనలేదు. గుజరాత్ ప్రచారంలో సహితం ఇప్పటివరకు పాల్గొనలేదు. సీనియర్ నాయకులు సహితం ఎవ్వరి ధోరణి వారుగా ఉంది. తెరవెనుక ఉంది పెత్తనం చేస్తున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నిమగ్నమై కీలక సమయాలలో అందుబాటులో ఉండటం లేదు.