2024 అమెరికా అధ్య‌క్ష ఎన్నికల్లో అభ్యర్థిని… ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తిరిగి పోటీ చేయబోతున్నట్లు కొంతకాలంగా చెబుతూ వస్తున్న మాజీ అద్యయక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించేశారు. 2024లో జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్య‌క్ష ఎన్నికలలో పోటీప‌డ‌నున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు.
వైట్‌హౌజ్ కోసం ఎన్నిక‌ల్లో నిల‌వ‌నున్న‌ట్లు అమెరికా ఎన్నిక‌ల సంఘం ముందు ట్రంప్ త‌న ప‌త్రాల‌ను స‌మ‌ర్పించిన‌ట్లు తెలుస్తోంది. అమెరికాను మ‌ళ్లీ గొప్ప స్థానంలో నిలిపేందుకు, వైభ‌వంగా నిలిపేందుకు దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ రోజు నుండి 2024లో ఎన్నిక జరిగేవరకు ఇంతవరకు మరెవ్వరు పోరాడని విధంగా తాను గెలుపుకోసం పోరాడుతూ ఉంటానని స్పష్టం చేశారు. 
అమెరికా పునరాగమనం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది అంటూ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి టెలివిజన్‌ ప్రసంగం ద్వారా ప్రకటించారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి.. ఈ రాత్రి అమెరికా అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని నేను ప్రకటిస్తున్న’ అని తెలిపారాయన. ఆపై తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌  ట్రూత్ సోషల్లో ‘‘ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా మారుతుందని ఆశిస్తున్నా’’ అంటూ ట్రంప్ పోస్ట్‌ చేశారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ప్ర‌ఖ్యాతిగాంచిన‌ రిప‌బ్లిన్ పార్టీకి చెందిన ట్రంప్ 2016లో అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో బైడెన్ చేతిలో ఆయ‌న ఆ రేసులో ఓడిపోయారు. రిప‌బ్లిక‌న్ పార్టీలో ట్రంప్‌పై వ్య‌తిరేక‌త ఉన్నా, 2024లో జ‌రిగే దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.
 అభిమానుల ముందు ప్ర‌సంగించ‌డం చాలా ఈజీగా ఉంద‌ని, ఇలాంటి ప్రేమ ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తానే పోటీ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. దేశాన్ని ఛిద్రం చేస్తున్న రేడిక‌ల్ లెఫ్ట్ డెమోక్రాట్ల‌ను ఓడిద్దామ‌ని ఆయ‌న ఈ సందర్భంగా పిలుపిచ్చారు.
మరోవంక, డోనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా చేసిన ఆయన కుమార్తె ఇవాంకా ఇక తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. 2024లో దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ ప‌డ‌నున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించిన కొన్ని గంట‌ల తేడాలోనే 2024 కోసం త‌న తండ్రి చేసే ప్ర‌చారంలో పాల్గొన‌డం లేద‌ని ఆమె స్పష్టం చేశారు.
నాన్న‌ను ఎంతో ప్రేమిస్తాన‌ని, కానీ ఈసారి త‌న స‌మ‌యాన్ని పిల్ల‌ల కోసం కేటాయించ‌నున్నాన‌ని, ఫ్యామిలీతోనే గ‌డ‌ప‌నున్న‌ట్లు ఇవాంకా త‌న ప్రకటనలో చెప్పారు. రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవాల‌న్న ఉద్దేశ్యం  లేద‌ని, తండ్రికి ఎప్పుడూ మ‌ద్ద‌తు ఇస్తాన‌ని, రాజ‌కీయ క్షేత్రానికి సంబంధం లేకుండా త‌న పాత్ర ఉంటుంద‌ని ఇవాంకా తెలిపారు.