ఈ ఏడాది ఎగుమతులతో 12 శాతం వరకు వృద్ధి

ముఖ్యమైన విదేశీ మార్కెట్లలో భారీ ద్రవ్యోల్భణం, వృద్ధి నెమ్మదించడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ  భారత్​ నుంచి  ఎగుమతులను భారీగా పెంచుతామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి పీయూష్ గోయల్ భరోసా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్​ సమిట్​లో ఆయన మాట్లాడుతూ, భారతదేశ సరుకుల ఎగుమతులు ఈ సంవత్సరం 10-–12శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తాయని స్పష్టం చేశారు.
దేశంలో ఎగుమతులు వృద్ధి మందగిస్తూ ఉండడంతో కూలీలు ఎక్కువగా ఉండే టెక్స్‌‌టైల్,  తయారీ వంటి రంగాలలో ఉద్యోగాలు పోతాయనే భయాలు రేకెత్తిన నేపథ్యంలో మంత్రి ఈ భరోసా ఇచ్చారు.  ఈ ఏడాది సెప్టెంబరులో రూపాయి విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుమతులు మోస్తరుగానే జరిగాయి. భారతదేశ సరుకుల ఎగుమతులు 19 నెలల్లో అతి తక్కువ వేగంతో పెరిగాయి.
“నెలవారీ ఆటుపోట్ల గురించి వ్యాపారాలు ఎప్పుడూ భయపడవు. ద్రవ్యోల్భణం, రూపాయి విలువ తగ్గుదల వంటి అనేక సమస్యలకు తోడు పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గుతున్నది. అయినప్పటికీ భారతదేశం  సరుకుల ఎగుమతుల వ్యాపారం ఏటా 10 నుండి 12 శాతం పెరుగుతుంది. మనం స్వాతంత్ర్యం పొంది 100 ఏళ్లు పూర్తయ్యే సరికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి” అని గోయల్ తెలిపారు.
అధిక ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం సూచనల కారణంగా అమెరికా,  యూరోపియన్ యూనియన్‌తో సహా భారతదేశ ప్రధాన మార్కెట్‌లలో డిమాండ్ మందగించింది. ఫలితంగా ఇంజనీరింగ్, రెడీమేడ్ గార్మెంట్స్, కాటన్, నూలు, ప్లాస్టిక్స్,  లినోలియంతో సహా కీలక రంగాల ఎగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో విపరీతంగా తగ్గాయి.
మోదీ  ప్రభుత్వం సంతకం చేస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఏ) గురించి గోయల్ మాట్లాడుతూ, ఎఫ్‌టీఏలపై ఇకపై సంతకాలు చేయడం లేదని, భారతదేశం  దీర్ఘకాలిక ప్రయోజనాలను జాగ్రత్తగా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
“మనకు న్యాయం చేయని వాణిజ్య ఒప్పందం గురించి గతంలో చర్చలు జరిగాయి. మా ప్రభుత్వం చర్చలను కొనసాగిస్తుంది. మేం ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్​సీఈపీ)పై సంప్రదింపులను కొనసాగిస్తున్నాం. అయితే మన ఎంఎస్​ఎంఈ,  డెయిరీ రంగాలు ఈ ఒప్పంద ప్రభావం గురించి భయపడుతున్నాయి” అని కేంద్ర మంత్రి తెలిపారు.
భారత్ ఆర్​సీఈపీ నుండి వైదొలగడానికి కారణం చైనా–-ఇండియా ఫ్రీ ట్రేడ్​ ఒప్పందం అని మంత్రి గుర్తు చేశారు. అమెరికాతో ఎఫ్‌టీఏపై అడిగిన ప్రశ్నకు గోయల్ స్పందిస్తూ, ప్రస్తుతం అమెరికా సహా ఎవరితోనూ ఇట్లాంటి ఒప్పందాలపై సంతకాలు చేయడం లేదని చెప్పారు.
“భారతదేశం–అమెరికా మధ్య వాణిజ్యం మెరుగుపడుతోంది. మేం ఇండో–-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్​) నుండి వైదొలగడం నిజమే కానీ దాని తలుపులను పూర్తిగా మూసి వేయలేదు. ప్రస్తుతం ఒప్పందం అమల్లో లేదు. చర్చలు జరుగుతున్నాయి. గణనీయమైన ప్రయోజనం పొందగలమని భావిస్తే దానిలో చేరే ప్రతిపాదనను పరిశీలిస్తాం” అని గోయల్ వివరించారు.
ఏదేమైనా, భారత్ తన సొంత నిబంధనల ప్రకారం ఒప్పందాలపై సంతకం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. “యూఎస్​ ఆర్థికమంత్రి జానెట్ యెల్లెన్ ఫ్రెండ్ షోరింగ్ (మిత్రదేశాల మధ్య వాణిజ్యం పెంచడం) గురించి మాట్లాడారు. వాళ్లు మనతో వాణిజ్యాన్ని పెంచాలని కోరుకుంటున్నారు  ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్ల కోసం భారతదేశంపై ఆసక్తి చూపిస్తున్నారు” అని గోయల్ చెప్పారు.
గల్ఫ్ , ఐరోపా​ సహా ఎన్నో దేశాలు మనతో ఫ్రీ ట్రేడ్​ అగ్రిమెంట్లని కోరుకుంటున్నాయని చెబుతూ ప్రస్తుతానికి అన్ని  అగ్రిమెంట్లను కుదుర్చుకోవడం   వీలుకాదని పీయూష్​ గోయల్​ వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఫ్రీట్రేడ్​ అగ్రిమెంట్లు మనకు అనుకూలంగా లేవని,  అందుకే వీటి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.