కాలుష్య నివారణకు సరైన పరిష్కారాలను అన్వేషించాలి

ఢిల్లీలో కాలుష్య నివారణకు సరైన పరిష్కారాలను అన్వేషించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ సూచించారు. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో రైతులు పంటల వ్యర్థాలను పొలాల్లోనే తగులబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోందని, దీన్ని నివారించాలంటే పంట వ్యర్థాల కాల్చివేతపై పూర్తి నిషేదం విధించాలని కోరుతూ న్యాయవాది శశాంక్‌ శేఖర్‌ ఝా పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
దీనిని అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాల్సిందిగా విన్నవించారు. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ జెబి పార్దీవాలాతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.  నిషేదం విధించడం వంటివి కచ్చితంగా న్యాయవ్యవస్థ పరిధిలోకి వచ్చే అంశాలు కాదని జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేశారు.  ‘రైతుల పంట వ్యర్థాల కాల్చివేత తర్వాత చూద్దాం! ముందు ఢిల్లీ కాలుష్య నివారణకు మీ వద్ద ఉన్న  పరిష్కారమేమిటి’ అని పిటిషనర్‌ను నిలదీశారు.
దీనికి న్యాయవాది శశాంక్‌ శేఖర్‌ ఝా స్పందిస్తూ ఢిల్లీలో కాలుష్య నివారణకు పంటల వ్యర్థాల కాల్చివేతపై నిషేదం అత్యంత ప్రధానమైందని పునరుద్ఘాటించారు.   దీనిపై స్పందించిన సిజెఐ ”కాబట్టి దీనిని మీము నిషేధించాలా? నిషేధం విధించినంతనే ఆగిపోతుందా? పంజాబ్‌, యుపిలోని రైతు రైతుకు నిషేదం విధించాలా?’ అని ప్రశ్నించారు. అందువల్ల, ఈ అంశాన్ని  ప్రాధాన్యతగా జాబితా చేయడానికి నిరాకరించారు.
”మేము మీ వాదన విన్నాము. కానీ దీన్ని ఇప్పుడు విచారణకు తీసుకోం” అని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. కాలుష్య నివారణకు వాస్తవ పరిష్కారాలను అన్వేషించాలని తెలిపారు.
 
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో కోర్టు తక్షణ జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు గత వారం అంగీకరించింది. ‘ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది’ అని అప్పటి సిజెఐ జస్టిస్‌ యుయు లలిత్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 
 
అలాగే నవంబర్‌ 10 (గురువారం) ఈ అంశాన్ని జాబితా చేయడానికి కోర్టు అంగీకరించింది. పిటిషన్‌ను గురువారం విచారించిన సిజెఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం అత్యవసర విచారణకు తిరస్కరించింది.