కోయంబ‌త్తూర్ ఆత్మాహుతి బాంబు మృతుడు ఇస్లామిక్ స్టేట్ స‌భ్యుడు

కోయంబ‌త్తూర్ ఆత్మాహుతి కారు బాంబు దాడిలో చ‌నిపోయిన వ్య‌క్తి ఇస్లామిక్ స్టేట్ స‌భ్యుడ‌ని, స్థానిక ఆల‌యం మీద దాడి చేసేందుకు ప్ర‌ణాళిక ర‌చించాడ‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తెలిపింది.
 
 దీపావళికి ఒకరోజు ముందు అక్టోబ‌ర్ 23వ తేదీన కోయంబ‌త్తూర్‌లో జ‌మేష ముబీన్ అనే 29 ఏండ్ల‌ ఇంజ‌నీరింగ్ విద్యార్థి ఆత్మాహుతి కారు బాంబు దాడిలో చ‌నిపోయాడు. కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతి కారులో ఉన్న సిలిండర్‌ పేలిపోయింది. కొట్ట‌యిలోని ఈశ్వ‌ర‌న్ దేవాల‌యం మీద దాడి చేసి విగ్ర‌హాలు, గుర్తుల‌ను ధ్వంసం చేయ‌డం ద్వారా హింస‌కు ప్రేరేపించాల‌ని అనుకున్నాడ‌ని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
 
అత‌ని ఇంటిలో ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, హింస‌కు ప్రేరేపించే డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.  అక్టోబ‌ర్ 23న సాయంత్రం నాలుగు గంట‌ల‌కు పేలుడు ప‌దార్ధాలు, ఎల్‌పీజీ సిలిండ‌ర్ ఉన్న‌ మారుతీ 800 కారుని ఈశ్వ‌ర‌న్ దేవాల‌యం ఎదుట‌ ముబీన్ పార్క్ చేశాడు.
 
అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్‌ బాల్స్‌, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానాలకు తావిచ్చింది. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదేనెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
సిలిండ‌ర్ పేల‌డంతో ముబీన్ అక్క‌డిక్క‌డే చ‌నిపోయాడు. 2019లో శ్రీలంకలో జ‌రిగిన‌ ఈస్ట‌ర్ సండే బ్లాస్ట్ త‌ర్వాత ఇస్లామిక్ స్టేట్ సంస్థ‌తో సంబంధాలు ఉన్నాయ‌నే అనుమానంతో ముబీన్‌ని పోలీసులు విచారించారు. ఈ బాంబు దాడి కేసులో ఇప్ప‌టివ‌రకూ ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, కారు బాంబు దాడికి పాల్ప‌డింది ముబీన్‌గా గుర్తించారు.
 
ఈ కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఎ  బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని 45 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అనుమానితులు, వారికి సంహకరించిన వారి ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పడుపెట్‌, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్‌మేడు, ఉక్కడం, పొన్విఝా నగర్‌, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.