జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఘన విజయం సాధించాయి. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్న ఓ నకిలీ ఎన్జీఓను గుర్తించారు. దీనికి సంబంధించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్థానిక పోలీసులతో కలిసి ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ చేపట్టింది.
కుప్వారాలో టెర్రర్ ఫండింగ్, రిక్రూట్‌మెంట్ మాడ్యూల్‌ను ఛేదించింది. పట్టుబడిన వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఐఈడీ తయారీకి వినియోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఐదు పిస్టల్స్, 10 మ్యాగజైన్లు, 49 పిస్టల్ మందుగుండు సామగ్రి, రెండు గ్రనేడ్లు, ఒక ఐఈడీని ఉన్నాయి.
కుప్వారా జిల్లాలోని చీర్‌కోట్ ప్రాంతానికి చెందిన బిలాల్ అహ్మద్ దార్ అనే వ్యక్తికి సంబంధించి అందిన సమాచారం మేరకు.. ఉత్తర కాశ్మీర్‌లోని జిల్లాలోని నట్నుస్సా, లోలాబ్ ప్రాంతాలలో సైన్యం, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఇక్కడ అదుపులోకి తీసుకున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు వివిధ ప్రాంతాల నుంచి మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
వీరంతా తీవ్రవాదులకు నిధులు అందజేసేందుకు ఇస్లాహి ఫలాహి రిలీఫ్ ట్రస్ట్ (ఐఎఫ్ఆర్‌టీ) అనే ఎన్జీఓను నడుపుతున్నట్లు గుర్తించారు. ఉత్తర కాశ్మీర్‌లోని ‘తెహ్రీక్-ఇ-ఉల్ ముజాహిదీన్ జమ్ముకశ్మీర్’ కార్యకలాపాలకు సహాయం చేయడానికి ఈ మాడ్యూల్‌ను పాకిస్తాన్ హ్యాండ్లర్లు సమన్వయం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
More Stories
మోదీ, అమిత్ షా ల ఎఐ ఫోటోలు వాడిన ఆప్ పై కేసు
కేరళ, తమిళనాడు తీరాలకు కల్లక్కడల్ ముప్పు
హైడ్రోజన్ రైలును పరిచయం చేసిన భారత్