కేంద్రీయ బ్యాంకులు బంగారం కొనుగోలులో అగ్రగామిగా ఆర్బీఐ

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెల‌కొన్న నేప‌థ్యంలో ఆర్బీఐతో పాటు  వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం నిల్వ‌లు పెంచుకుంటున్నాయి. డాల‌ర్‌పై రూపాయికి మ‌ద్ద‌తుగా ఆర్బీఐ బంగారం కొనుగోలు చేస్తుండగా, తమ తమ దేశాల  క‌రెన్సీకి మద్దతుగా ఇతర కేంద్రీయ బ్యాంకులు గ‌త జూలై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో 399.3 ట‌న్నుల బంగారం కొనుగోలు చేశాయి.
గ‌తేడాదితో పోలిస్తే ఇది 4.4 రెట్లు అధికం. 2021 జూలై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో కేవ‌లం 90.6 ట‌న్నుల బంగారం మాత్ర‌మే కొన్నాయి కేంద్రీయ బ్యాంకులు. ఇందులో ఆర్బీఐ అగ్రగామిగా ఉండడం గమనార్హం. ద‌శాబ్ధి కాలానికి పైగా ఒక త్రైమాసికంలో కేంద్రీయ బ్యాంకులు బంగారం అత్య‌ధికంగా కొనుగోలు చేయ‌డం ఇదే తొలిసారి.
దీనికి తోడు ప్ర‌స్తుతం దేశంలో వివాహాల సీజ‌న్ సాగుతున్న‌ది. వివాహాల కోసం బంగారం కొనుగోళ్లు త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో మున్ముందు బంగారం ధ‌ర‌లు పైపైకి దూసుకెళ్తాయ‌ని బులియ‌న్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.ప్ర‌పంచ స్వ‌ర్ణ మండ‌లి (డ‌బ్ల్యూజీసీ) డిమాండ్ ట్రెండ్స్ నివేదిక ప్ర‌కారం 2022 తొలి తొమ్మిది నెల‌ల్లో వివిధ దేశాల కేంద్రీయ  బ్యాంకుల నుంచి 673 ట‌న్నుల‌కు బంగారం డిమాండ్ పెరిగింది. 2018లో కొనుగోలు చేసిన 656.6 ట‌న్నుల బంగారం కంటే 2.5 రెట్లు బంగారం కొనుగోళ్లు జ‌రిగాయి.

జూలై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు జ‌రిపిన కేంద్రీయ బ్యాంకుల జాబితాలో ఆర్బీఐ ముందు వ‌రుస‌లో ఉంది. ప్ర‌స్తుత అనిశ్చిత ప‌రిస్థితుల్లో బంగారం ఫారెక్స్ రిజ‌ర్వులు 17.5 ట‌న్నులు పెంచుకున్న‌ది. బంగారం కొనుగోళ్లు చేసిన కేంద్రీయ బ్యాంకుల్లో ఆర్బీఐకి మూడో స్థానం ఉంది. 2020 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబ‌ర్ మ‌ధ్య అత్య‌ధికంగా 132.4 ట‌న్నుల బంగారం కొనుగోళ్లు జ‌రిపింది ఆర్బీఐ.

గ‌త అక్టోబ‌ర్‌లో అమెరికా డాల‌ర్ ఇండెక్స్ 16 శాతం పెరిగింది. ఈ నేప‌థ్యంలో వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు స్థానిక క‌రెన్సీకి మ‌ద్ద‌తుగా బంగారం కొనుగోళ్లు జ‌రిపాయి. డాల‌ర్‌పై రూపాయి మార‌కం విలువ రిస్క్‌ను త‌గ్గించ‌డానికి ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు మరింతగా పెంచొచ్చున‌ని భావిస్తున్నారు.

ఒక‌వైపు రూపాయి బ‌లోపేతానికి మ‌ద్ద‌తుగా ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు జ‌రుపుతుంటే, గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌) నుంచి ఇన్వెస్ట‌ర్లు బంగారం విత్ డ్రాయ‌ల్స్ చేస్తున్నారు. ప్ర‌పంచ స్వ‌ర్ణ మండ‌లి (డ‌బ్ల్యూజీసీ) నివేదిక ప్ర‌కారం సెప్టెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈటీఎఫ్‌ల నుంచి నిక‌రంగా 227 ట‌న్నుల బంగారం విత్‌డ్రాయ‌ల్స్ జ‌రిగాయి. ఇది 2013 జూన్ త్రైమాసికం త‌ర్వాత అత్య‌ధికం.