
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత న్యాయవ్యవస్థకు చంద్రచూడ్ 50వ ప్రధాన న్యాయమూర్తి.
44 ఏళ్ల క్రితం ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేయగా, ఇప్పుడు ఆయన తనయుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. నేటి నుంచి 2024 నవంబర్ 10వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ వైవి చంద్రచూడ్ ఫిబ్రవరి 22, 1978 నుంచి జూలై 11, 1985 వరకు సీజేఐగా తన సేవలను అందించారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వైవీ చంద్రచూడ్ కుమారుడైన డీవై చంద్రచూడ్ 1959 నవంబర్ 11వ తేదీన జన్మించారు. 1979లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ బీ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఆయన 1986 లో హార్వర్డ్ నుండి డాక్టర్ ఆఫ్ జ్యూరిడిషియల్ సైన్సెస్ (ఎస్జేడీ) డిగ్రీ పట్టా పొందారు.
జస్టిస్ చంద్రచూడ్ 1998 నుండి 2000 వరకు భారతదేశానికి అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 1998లో బాంబే హైకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. 2000 మార్చి 29న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన చంద్రచూడ్.. 2013 అక్టోబరు 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు అక్కడే పనిచేశారు.
2016 మే 13న సుప్రీంకోర్టుకు పదోన్నతి లభించింది. చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన అనేక రాజ్యాంగ ధర్మాసనాలు, సుప్రీంకోర్టు బెంచ్‌లలో జస్టిస్ చంద్రచూడ్ భాగమయ్యారు. అయోధ్య భూవివాదం, ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్క సంబంధాలను నేరరహితం, ఆధార్ పథకం చెల్లుబాటుకు సంబంధించిన విషయాలు, శబరిమల సమస్య, సైన్యంలోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు, భారత నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వంటి నిర్ణయాలు.
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించడానికి చాలా ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే వైద్యుల పర్యవేక్షణలో గర్భస్రావం చేయించుకునే అవకాశం కల్పిస్తున్న చట్టం పరిధిని విస్తరించి, అవివాహిత మహిళలను కూడా చేర్చారు. దీనివల్ల అవివాహిత మహిళలు అధికారికంగా గర్భస్రావం చేయించుకోవడానికి అవకాశం ఏర్పడింది.
భారత సుప్రీంకోర్టు చరిత్రలో తండ్రీకొడుకులు సీజేఐలు కావడం ఓ రికార్డు. అయితే తన తండ్రి ఇచ్చిన తీర్పులను డీవై చంద్రచూడ్ రెండుసార్లు తోసిపుచ్చడం విశేషం. ఆయన తన విజ్ఞతను ఉపయోగించి తీర్పులిస్తారనే పేరు తెచ్చుకున్నారు. ఆయన దృఢనిశ్చయంగల న్యాయమూర్తి అని కూడా పేరుంది. ఆయన తీర్పుల్లో ప్రజల ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యమివ్వడం కనిపిస్తుంది. ఆయన తన వద్దకు వచ్చిన కేసుల్లో స్వీయానుభవంతో, తాదాత్మ్యంతో పరిష్కారాలను సూచించినట్లుగా కనిపిస్తుంది.
More Stories
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!
విద్యార్థి వీసాపై పాక్ కు వెళ్లి శిక్షణ తీసుకున్న ఆదిల్ థోకర్!