`సుప్రీం తీర్పు’ ప్రధాని మోదీ ‘మిషన్‌’కు లభించిన విజయం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆమోదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ, కాంగ్రె్‌సలు స్వాగతించాయి. దేశంలోని పేదలందరికీ సామాజిక న్యాయం అందాలన్న ప్రధాని మోదీ ‘మిషన్‌’కు లభించిన చరిత్రాత్మక విజయమంటూ హర్షం వ్యక్తం చేసింది. తీర్పు స్వార్థపర శక్తులకు చెంపపెట్టు అంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు.
తప్పుడు ప్రచారంతో సమాజంలో విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన వారి ఆటలు బందయ్యాయని తెలిపారు. సామాజిక న్యాయం, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ అన్న విధానం మరింత బలపడుతుందని చెప్పారు. దీని ద్వారా అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ప్రధాని ‘విజన్‌’ అయిన గరీబ్‌ కల్యాణ్‌ సాధనకు మరింత శక్తిని ఇస్తుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్‌.సంతోష్‌ తెలిపారు.
రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేసిన గుజరాత్‌కు చెందిన పాటీదార్‌ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేసింది. దీంతో ఆందోళనలకు ముగింపు లభిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ చెప్పారు. ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ మాట్లాడుతూ 68 సామాజిక వర్గాలకు ఈ తీర్పు ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పారు. తమ ఉద్యమం కారణంగా లబ్ధి కలిగినందుకు గర్వపడుతున్నానని తెలిపారు.
అయితే, ఈ తీర్పుపై కాంగ్రెస్‌ ఎస్సీ,ఎస్టీ విభాగం ఇన్‌ఛార్జి ఉదిత్‌ రాజ్‌ భిన్నంగా స్పందించారు. సుప్రీంకోర్టు కులతత్వంతో వ్యవహరించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు పెంచే సమయంలో 50 శాతం పరిమితి అంటూ అనుమతి ఇవ్వలేదని, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయంలో మాత్రం యూ టర్న్‌ తీసుకుందని విమర్శించారు.
కాగా, ఉదిత్‌ రాజ్‌ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఖండించారు. కోర్టు తీర్పులను ఎవరైనా సవాలు చేయవచ్చని, కానీ కులతత్వాన్ని అంటగడుతూ విమర్శలు చేయడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని చెప్పారు. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారో లేదో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేయాలని డిమాండు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్‌ అధికారికంగా స్వాగతించింది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది తామేనని గుర్తుచేసింది. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు 2005-06లో సిన్హో కమిటీ వేసినట్టు తెలిపింది. 2010 ఆ కమిటీ సూచనలతో సామాజిక-ఆర్థిక సర్వే చేయించినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ తెలిపారు.