దేశాన్ని న్యాయ వ్యవస్థ నడిపించాలా? లేక ఎన్నికైన ప్రభుత్వమా?

”దేశాన్ని న్యాయవ్యవస్థ నడిపించాలా? లేక ఎన్నికైన ప్రభుత్వమా?” అని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రశ్నించారు. ”న్యాయవ్యవస్థ నిబంధనలను రూపొందించడం ప్రారంభిస్తే, రహదారి ఎక్కడ నిర్మించాలో నిర్ణయిస్తుంది. న్యాయవ్యవస్థ సర్వీస్‌ నియమాల్లోకి వస్తే ఇంక ప్రభుత్వం దేనికి” అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ కార్యనిర్వాహక వ్యవస్థలోకి ప్రవేశిస్తూ, న్యాయవ్యవస్థ తన సరిహద్దులను అతిక్రమించ కూడదని స్పష్టం చేశారు. దేశాన్ని నడిపించే పనిని ఎన్నికైన ప్రతినిధులకే వదిలివేయాలని చెప్పారు.  ”దేశ ద్రోహ చట్టంలోని నిబంధనలను మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సుప్రీంకోర్టుకు చెప్పాం. అయినప్పటికీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. అది కచ్చితంగా మంచిది కాదు. అందరికీ లక్ష్మణ రేఖ ఉంది. దేశ ప్రయోజనాల కోసం లక్ష్మణ రేఖను దాటొద్దు” అని ఆయన న్యాయవ్యవస్థకు హితవు చెప్పారు.

కాగా,ఆ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును పెంచే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై భారాన్ని పెంచే అర్హత లేని కేసులు సుప్రీం కోర్టు వరకు వెళ్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

“ప్రతి బెయిల్‌ సుప్రీంకోర్టుకు వెళుతోంది. సుప్రీం కోర్టు దేశం బెయిల్‌ పిటిషన్లను విచారించేలా ఉంది. బెయిల్‌ పిటిషన్లను దిగువ కోర్టులు పరిష్కరించాలి. పరిమిత కేసులు హైకోర్టుకు రావాలి. సుప్రీంకోర్టును మరచిపోవాలి. మరణశిక్ష, కొన్ని తీవ్రమైన కేసులు తప్ప బెయిల్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ఎందుకు పరిష్కరించాలి” అని కేంద్ర మంత్రి సూచించారు.

మధ్యవర్తిత్వ బిల్లు వచ్చే శీతాకాల సమావేశాల్లో ఆమోదిస్తామని ఆయన చెప్పారు. మధ్యవర్తిత్వంతో పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరించవచ్చునని పేర్కొంటూ పరిమిత కేసులే కోర్టుకు రావాలని ఆయన సూచించారు. 2015లో జాతీయ న్యాయ కమిషన్‌ (ఎన్‌జెఎసి) చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, దానికి మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందించలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణం కాదని, అయితే మెరుగైన వ్యవస్థకు కృషి చేయాల్సి ఉందని చెప్పారు. వ్యవస్థలో పారదర్శకత లోపించినప్పుడు అది కేవలం న్యాయమూర్తులు, న్యాయవాదుల ఆలోచనలను మాత్రమే ప్రతిబింబిస్తుందని చెప్పారు.