త్వరలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా‌.. నిర్మలా సంకేతం

జమ్ముకశ్మీర్‌ కు త్వరలో రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అటువంటి స్పష్టమైన సంకేతాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చారు.

న్యూఢిల్లీలో “కేంద్ర రాష్ట్ర సంబంధాలు – సహకార సమాఖ్యత: ఆత్మనిర్భర్ భారత్ వైపు మార్గం” అంశంపై జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న నిధుల గురించి ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఈ విషయమై స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ఆమోదించారని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

అందువల్ల, ఇవాళ పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అయితే జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం కానందున ప్రస్తుతం 41 శాతం ఇస్తున్నామని పేర్కొంటూ త్వరలో అది రాష్ట్రంగా మారుతున్నందున ఈ శాతం తిరిగి పెరుగుతుందని.. ఆమె చెప్పారు.

అవినీతికి తావులేకుండా పారదర్శకతతో నిధుల పంపిణి చేస్తున్నామని   ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. తమకు  బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు అనే తేడా లేదని ఆమె చెప్పారు. మొదటగా మనం ప్రజల విశ్వాసం చూరగొనాలని, ఈ విషయంలో ఏ రాష్ట్రం కూడా మినహాయింపు లేదని ఆమె సూచించారు.