జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు ఈడీ సమన్లు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)   నోటీసులు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో గురువారం విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన అధికారులు జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతో పాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్ల నగదును సీజ్‌ చేశారు.మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 1,000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్‌కు సంబంధించి వచ్చిన నేరాలను గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది.“రాజకీయ పలుకుబడితో మిశ్రా, జార్ఖండ్‌లోని బర్హైత్, సాహిబ్‌గంజ్ నుండి ఎమ్మెల్యేగా, సాహిబ్‌గంజ్, దాని పరిసర ప్రాంతాలలో అక్రమ మైనింగ్ వ్యాపారాలను, అలాగే తన సహచరుల ద్వారా లోతట్టు ఫెర్రీ సేవలను నియంత్రిస్తున్నట్లు పిఎంఎల్‌ఎ దర్యాప్తులో తేలింది.”

“రాతి చిప్స్ ,బండరాళ్ల మైనింగ్‌తో పాటు సాహిబ్‌గంజ్‌లోని వివిధ మైనింగ్ సైట్‌లలో ఏర్పాటు చేసిన అనేక క్రషర్ల సంస్థాపన, కార్యకలాపాలపై అతను గణనీయమైన నియంత్రణను కలిగి ఉన్నాడు” అని ఈ కేసులో రాంచీ  ప్రత్యేక కోర్టు ముందు దాఖలు చేసిన  ఛార్జ్ షీట్ లో  ఈడీ ఆరోపించింది.

కాగా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంగం సూచించింది,