భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. బిట్‌కాయిన్ వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధ ప్రత్యామ్నాయమైన డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) తొలి పైలట్ ప్రాజెక్టును నవంబరు 1న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది.
సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రిటైల్ లావాదేవీల కోసం డిజిటల్ రూపీ తొలి పైలట్ ప్రాజెక్టును నెల రోజుల్లోపే ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
తొలి విడతగా, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లు-మర్చంట్లతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లకు మాత్రమే డిజిటల్ రూపాయి ద్వారా రిటైల్ లావాదేవీలు జరిపే అవకాశం కల్పించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిజిటల్ రూపీ (హోల్‌సేల్) తొలి పైలట్ ప్రాజెక్టుగా సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల సెటిల్‌మెంట్ యూజ్ కేస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీల కోసం డిజిటల్ రూపాయి జారీ చేసేందుకు ఎస్‌బీఐ సహా 9 బ్యాంక్‌లను ఎంపిక చేసినట్లు తెలిపింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎ్‌ఫసీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎ్‌సబీసీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ పైలట్ ప్రాజెక్టు నేర్పే అనుభవాల ఆధారంగా భవిష్యత్‌లో ఇతర టోకు లావాదేవీలు, అంతర్జాతీయ చెల్లింపుల పైలట్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో ఒక నెలలోపు డిజిటల్ రూపాయి – రిటైల్ సెగ్మెంట్ మొదటి పైలట్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆర్బిఐ తెలిపింది.
సీబీడీసీల్లో సెటిల్‌మెంట్ ద్వారా లావాదేవీల వ్యయం కూడా తగ్గుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. మార్కెట్ లావాదేవీలు నెరిపేందుకు సీబీడీసీ మరో ప్రత్యామ్నాయమని, డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చాక కూడా భౌతిక కరెన్సీ చెలామణి కొనసాగుతుందని ఈ మధ్యన విడుదల చేసిన కాన్సెప్ట్ నోట్ (నమూనా పత్రం)లో ఆర్‌బీఐ పేర్కొంది.
వాస్తవానికి ఆర్బీఐ ఇప్పుడు విడుదల చేస్తున్న డిజిటల్ రుపీ.. బిట్‌కాయిన్ తదితరాల్లా బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రూపొందిన క్రిప్టోకరెన్సీ కాదు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కరెన్సీకి మరో రూపం. ఒక్క రూపాయికి ఒక డిజిటల్ రుపీ సమానం. ఒక్కమాటలో చెప్పాలంటే మనం వాడుతున్న లీగల్ కరెన్సీలాంటిదే. కాకపోతే డిజిటల్ రూపంలోనే ఉంటుంది. ఈ డిజిటల్ రుపీ రిజర్వ్‌బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లో ఉంటుంది. ఈ కారణంగా రూపాయిలానే దీనికి కూడా లీగల్ టెండర్ వర్తిస్తుంది.
ప్రస్తుతం వివిధ ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా చెల్లించడానికి ఉపయోగించే కరెన్సీ నోట్లకు మరో రూపమే డిజిటల్ రుపీ కూడా. కరెన్సీ నోట్లుగా కాకుండా డిజిటల్ రూపంలోనే దీనిని స్టోర్ చేసుకోవాలి. కానీ కాగితపు కరెన్సీగా కూడా డిజిటల్ కరెన్సీని మార్పిడి చేసుకోవచ్చు.
దీనితో నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. కరెన్సీ ప్రింటింగ్, స్టోరేజ్, రవాణా, నోట్ల రీప్లేస్‌మెంట్ వ్యయాలు తగ్గుతాయి. ఇప్పుడు వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్న నగదుకు అదనపు ఆప్షన్‌గా డిజిటల్ రూపీ ఉపయోగపడుతుందని ఆర్బీఐ గతంలో విడుదల చేసిన నోట్‌లో తెలిపింది.
ఇది డిజిటల్ సాధనమైనందున సులభంగా, వేగంగా, చౌకగా లావాదేవీలు జరపవచ్చు. కరెన్సీ నోట్లుగా కాకుండా డిజిటల్ మార్గంలో డబ్బును చెల్లించేటపుడు లభించే ప్రయోజనాలన్నీ తాజా డిజిటల్ రూపీతో లభిస్తాయి.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్