
గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ల క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈత వచ్చిన వారు మాత్రం ఆ చీకట్లోనే.. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
బ్రిడ్జి కూలే సమయానికి దానిపై 500 మందికి పైగా ప్రజలు ఉన్నట్టు సమాచారం. 177 మందిని సురక్షితంగా కాపాడారు. 230 మీటర్ల పొడవుండే ఈ తీగల వంతెన చాలా పాతది కావడంతో తరచుగా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఆరునెలల క్రితం దీన్ని మూసివేసి మరమ్మతులు నిర్వహించారు.
గుజరాతీల ఉగాది సందర్భంగా అక్టోబరు 26న పునరుద్ధరించి మళ్లీ ప్రజల రాకపోకలకు అనుమతిచ్చారు. ఆరు నెలల తర్వాత తెరవడం, ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై నిలబడటంతోనే కూలినట్టు అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల్లో సమీప దవాఖానలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని డీజీపీ అశిష్ భాటియా పేర్కొన్నారు.
ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 ప్లాటూన్ల ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, భారత నౌకా, వైమానిక దళ, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి దాదాపు 150 మంది ప్రాణాలు కాపాడినట్టు సమాచారం.
చీకటి కారణంగా సహాయకచర్యలకు అంతరాయం కలిగింది. ఈ దుర్ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ బ్రిడ్జి మరమ్మతులన్నీ పూర్తి చేసి కిందటివారమే పునరుద్ధరించామని, ఇంతలోనే ఇలా జరగడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని చెప్పారు. దీనికి బాధ్యత తామే తీసుకుంటున్నామని గుజరాత్ మంత్రి బ్రిజేష్ మిశ్రా తెలిపారు
ప్రధాని మోదీ మోర్బీ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, బాధితులకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు పీఎంవో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ ప్రకటించారు
‘ఇంజనీరింగ్ అద్భుతం’గా గుజరాతీలు సగర్వంగా చెప్పుకొనే 765 అడుగుల పొడవు ఉండే ఈ కేబుల్ బ్రిడ్జినిఈ బ్రిడ్జి 142 ఏళ్ల నాటిది. గుజరాత్‌లోని మహాప్రభుజి-సమకాంత ప్రాంతాలను కలిపే ఈ బ్రిడ్జిని.. 1879 ఫిబ్రవరి 20న నాటి బొంబాయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ప్రారంభించారు.
ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ మొత్తాన్నీ ఇంగ్లండ్ నుంచే తెప్పించి నిర్మించారు. ఆ రోజుల్లో దీని నిర్మాణానికి అయిన ఖర్చు దాదాపుగా రూ.3.5 లక్షలు. అయితే, 2001లో వచ్చిన భూకంపానికి ఈ బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతింది. అప్పట్నుంచీ తరచూ మరమ్మతులకు గురవుతోంది
More Stories
సామాజిక పరివర్తనే లక్ష్యంగా సంఘ శతాబ్ది
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు