ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాంలకై ప్రధాని సూచన 

ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని చెప్పారు. 
 
హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ  “ప్రతి రాష్ట్రం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవాలి.. పరస్పరం స్ఫూర్తి పొందుతూ.. దేశాభ్యున్నతికి కృషి చేయాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఇదే నిదర్శనం.. అదే సమయంలో దేశప్రజల పట్ల మన కర్తవ్యం కూడా” అని ఆయన సూచించారు.
 
నేరాలు ఇప్పుడు స్థానికతకు పరిమితం కావని, అంతర్రాష్ట్ర-అంతర్జాతీయ స్థాయి నేర సంఘటనలో పెరుగుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. అందుకే కేంద్ర-రాష్ట్ర వ్యవస్థల మధ్య పరస్పర సహకారం కీలకం అవుతున్నదని చెప్పారు. సైబర్ నేరమైనా, డ్రోన్ సాంకేతికతతో ఆయుధాలు లేదా మాదకద్రవ్యాల స్మగ్లింగ్ వంటి నేరమైనా ఆయా ముప్పుల పరిష్కారం దిశగా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతల కోసం కృషిచేస్తూనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అత్యాధునిక సాంకేతికతతో శాంతిభద్రతల వ్యవస్థ మెరుగుపడగలని చెబుతూ ఈ నేపథ్యంలో 5జి, దాని ప్రయోజనాలతోపాటు మరింత అప్రమత్తత అవసరాన్ని కూడా ముందుకు తెస్తుందని ప్రధాని పేర్కొన్నారు.  ‘పోలీస్ టెక్నాలజీ మిషన్’ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- వివిధ రాష్ట్రాల్లోని విభిన్న సాంకేతికతలు పరస్పరం వ్యవహరించలేవు కాబట్టి ఉమ్మడి వేదిక ఆవశ్యకతను ఆయన ప్రస్తావించగారు.
“మనకు అఖిలభారత దృక్పథం ఉండటంతోపాటు మనం అనుసరించే మంచి విధానాలు పరస్పర నిర్వహణకు వీలుగా ఉండాలి. వాటి మధ్య సార్వత్రిక సంధానం కూడా అవసరం” అని ప్రధాని స్పష్టం చేశారు. ‘రాష్ట్రాల పోలీసు వ్యవస్థలుఫోరెన్సిక్ సైన్స్‌లో సామర్థ్యాలను పెంచుకోవాలని, ఈ దిశగా గాంధీనగర్‌లోని జాతీయ న్యాయ-వైద్యశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని కోరారు.
శాంతిభద్రతల నిర్వహణ వారానికి ఏడు రోజులూ.. 24 గంటలూ నిర్విరామంగా నిర్వర్తించాల్సిన బాధ్యత అని ప్రధాని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియలలో సరికొత్త ఆవిష్కరణలు, పరిజ్ఞానాల మెరుగుదల దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని అనేక అంశాలను నేరరహితం చేయడం ఇందులో ఒక ముందడుగని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రాలు కూడా కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను విశ్లేషించి అనవసరమైన వాటిని తొలగించాలని కోరారు.
అవినీతి, ఉగ్రవాదం, హవాలా నేరాలతో పటిష్టంగా వ్యవహరించగల సంకల్పం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాల్లో స్పష్టంగా ఉందని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై నిర్ణయాత్మక పోరులో యుఎపిఎ’ వంటి చట్టాలు వ్యవస్థకు మరింత బలాన్నిచ్చాయని చెప్పారు. ఉగ్రవాదం క్షేత్ర స్థాయి నెట్ వర్క్ ను రూపు మాపవలసిన అవసరం ఎంతయినా ఉందని తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని కల్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడటం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.