బిహారీ బాబు కనిపించడం లేదంటూ అసాంసోల్‌ లో పోస్టర్లు

ఛాత్‌పూజ తరుణంలో “బిహారీ బాబు” కనిపించడం లేదంటూ పశ్చిమబెంగాల్‌లోని అసాంసోల్‌ లో పోస్టర్లు వెలిసాయి. అసాంసోల్ టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హాను ఉద్దేశించి ఈ పోస్టర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పోస్టర్ల కింద ‘బిహారీ జనతా అసాంసోల్’ అని రాసి ఉంది.
బెంగాల్, జార్ఖాండ్ సరిహద్దులోని ఆసాంసోల్‌లో బెంగాలీయేతరులు గణనీయంగా ఉన్నారు. ఏడెనిమిది ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించడంతో రాజకీయంగా కూడా దుమారం మొదలైంది. కొందరు క్రేజీ మనుషుల పని ఇదని తృణమూల్ 66వ వార్డు కౌన్సిలర్ సలీమ్ అన్సారి కొట్టిపారవేసారు.
కాగా, బీజేపీ మాత్రం బిహారీ బాబు మిస్సింగ్ పోస్టర్లపై తనదైన రీతిలో స్పందించింది. ”మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విదేశాల్లో పర్యటిస్తుంటారు. ఎంపీగానూ అంతే. ఆయనను ఇష్టపడేవారికి అది బాగానే ఉండవచ్చు. ఆ కారణంగానే ఆయన బీజేపీ ఉండలేకపోయారు” అంటూ ఎద్దేవా చేశారు.
“ఇక్కడ (బీజేపీలో) పనిచేసే వాళ్లు ప్రజల కోసం రాజకీయాలు నెరపాలి. ఆయన వెళ్లిన పార్టీలో చాలా మంది నేతలు, కార్యకర్తల జాడ ఉండదు. చాలామంది లోపలో ఉండిపోతారు. బయటకు రారు. ఆ తరహా సంస్కృతి ఆయన ఉన్న పార్టీలో ఉంది” అని బీజేపీ నేత దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.
బీజేపీ అభ్యర్థిగా బీహార్ నుండి  రెండుసార్లు గెలిచిన శత్రుఘ్నసిన్హా అసాంసోల్ నుంచి ఇటీవల టీఎంసీ అభ్యర్థిగా గెలుపొందారు. 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు.