రిషి సునాక్‌ విజయంపై నారాయణమూర్తి సంతోషం

బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌  బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఆయన మామ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు.
‘‘ రిషికి శుభాకాంక్షలు. తనను చూస్తుంటే గర్వంగా ఉంది. రిషి తన బాధ్యతల్లో విజయవంతం కావాలి. బ్రిటన్ ప్రజల ఆకాంక్షల మేరకు రిషి శాయశక్తులా పనిచేస్తారని భావిస్తున్నా. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన అత్యున్నత నిర్ణయాలు తీసుకుంటారని బలంగా నమ్ముతున్నాం’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షితా మూర్తిని రిషి సునాక్‌ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
సోషల్ మీడియాలో నిరంతరం క్రియాశీలకంగా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. ఈ సందర్భంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇవాళ భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పకనే చెప్పారు ఆనంద్ మహీంద్రా.

మహీంద్రా ట్వీట్‌ సారాంశం ఏంటంటే.. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వేళ భారతీయ నాయకులూ అందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, నాయకుల్లో తక్కువ శక్తి సామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్‌ చర్చిల్ అవహేళన చేశారు. 

కానీ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన సమాధానం చెప్పారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, సోమవారంనాడు ప్రధానిగా ఎన్నికైన అనంతరం రిషి సునాక్ తొలిసారి మాట్లాడుతూ, బ్రిటన్ చాలా గొప్ప దేశమని, ఆర్థిక సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటామనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు. దేశానికి ప్రస్తుతం సుస్థిరత, ఐక్యత అవసరమని, పార్టీని, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు తాను తొలి ప్రాధాన్యమిస్తానని చెప్పారు.

దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, మన పిల్లలు, మనుమలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు సుస్థిరత, ఐక్యతే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రజాసేవకు అహరహం శ్రమిస్తానని వాగ్దానం చేశారు. తాను ఒక హిందువుగా గర్విస్తున్నట్టు చెప్పారు.