కర్ణాటకలో మరో సాధువు అనుమానాస్పద మృతి

కర్ణాటకలో ఇటీవల ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి కన్నుమూశారు. మఠంలోని ఓ గదిలో సాధువు శవమై కనిపించడంతో కలకలం చెలరేగింది. 
 
ఆ గదిలో రెండు పేజీల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ కుదూర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం బెల్గాంలోని శ్రీ గరు మడివళేశ్వర మఠంలోని బసవ సిద్ధలింగ స్వామి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే.
రామనగరలోని శ్రీ కంచగుల్ మఠాధిపతి సంత్‌ బసవలింగ స్వామి తన గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండగా మఠం సిబ్బంది గుర్తించారు. సోమవారం ఉదయం దర్శనం కోసం వచ్చిన భక్తులు మఠం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా సాధువు మరణం బయటపడింది. 

సమాచారం అందుకున్న కుదూర్‌ పోలీసులు స్వామిజీ మృతదేహాన్ని దవాఖానకు తరలించి సాధువు గదిలో రెండు పేజీల నోట్‌ను స్వాధీనపర్చుకన్నారు. పరువు తీస్తామంటూ కొంత మంది వ్యక్తులు బెదిరిస్తున్నట్లు ఆ నోట్‌లో స్వామీజీ రాసినట్లుగా సమాచారం. 

అతి పురాతనమైన ఈ మఠంలో గత 25 సంవత్సరాలుగా బసవలింగ స్వామి దర్శనమిస్తున్నారు. రామనగర పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి సాధువు మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.

కర్ణాటక బెల్గాంలోని శ్రీ గురు మడివళేశ్వర మఠంలో రెండు నెలల క్రితం బసవ సిద్దలింగ స్వామి మృతదేహం లభ్యమైంది. శిష్యులు మఠం గదిని తెరిచి చూడగా సిద్దలింగం మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు కనిపించడంపై ఆ స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.