చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌

 చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్‌ కమిటీ జిన్‌పింగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. 
 
దీంతో పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌ తరువాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా 69 ఏండ్ల జిన్‌పింగ్‌ నిలిచారు.  ఇక మార్చిలో జరగబోయే ప్రభుత్వ వార్షిక శాసనసభ సమావేశాల్లో జిన్ పింగ్ పేరును అధికారికంగా మరోసారి చైనా అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. 
ఈ సందర్భంగా పార్టీ తనపై పెట్టిన నమ్మకానికి జిన్ పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు శ్రద్ధగా పనిచేస్తానని.. పార్టీకి, ప్రజలకు మాటిచ్చారు.  స్టాండింగ్‌ కమిటీ సభ్యులతో కలిసి జిన్‌పింగ్‌ మీడియాతో మాట్లాడుతూ  ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి చెందలేదని, అదేసమయంలో చైనా అవసరం కూడా ప్రపంచానికి ఉందని చెప్పారు.
గత నలభై ఏండ్లలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని, దీర్ఘకాలిన సామాజిక సుస్థిరతను చైనా సాధించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత సమష్టిగా నడపడానికి కృషిచేస్తామని చెప్పారు.  పార్టీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఉంచామని తెలిపారు. చైనాను అన్నిరకాలు ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తామని చెప్పారు.
షాంఘైలో చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా పనిచేసిన, తనకు అత్యంత సన్నిహితుడైన లీ కియాంగ్‌ను చైనా కొత్త ప్రీమియర్‌గా (ప్రధాని) జిన్‌పింగ్‌ ప్రకటించారు. కాగా, చైనా సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ అధినేతగా కూడా జిన్‌పింగ్‌ ఎన్నికయ్యారు. రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న కమ్యూనిస్టు పార్టీ నియమాన్ని 2018లో రద్దు చేశారు. 
పార్టీ నేతగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన జీ జిన్‌పింగ్ మరింత పట్టు పెంచుకోవడం కోసం తన విధేయులను పాలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీకి నియమించుకున్నారు. తన సన్నిహిత సహచరులకు పదోన్నతులు ఇచ్చారు. పార్టీ అత్యున్నత స్థాయి పరిపాలక వ్యవస్థ పాలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ. దీనిలో ఏడుగురు సభ్యులు ఉంటారు.
చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత స్థాయి వ్యవస్థలో ఈసారి మహిళలకు చోటు దక్కలేదు. దీనిలో మహిళలకు స్థానం లేకపోవడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి. గత పాలిట్‌బ్యూరోలో ఉన్న ఏకైక మహిళ సున్ చున్లాన్ పదవీ విరమణ చేశారు.
పార్టీలో తన స్థానం మరింత కలకాలం పదిలం చేసుకుని, తనకు నచ్చని వారిని పక్కన పెట్టి చైనాలో అత్యంత శక్తివంతమైన అధికార కమ్యూనిస్టు పార్టీ (సిపిసి)లో కీలకమైన సెంట్రల్ కమిటీలో ఈసారి భారీ ప్రక్షాళన జరిపారు. ప్రధాని లీ కిక్వియాంగ్ సహా అనేక మంది ప్రముఖ నేతల పేర్లు కమిటీలో చోటుచేసుకోలేదు.
 
పార్టీలో జి పట్ల వ్యతిరేకత అలుముకుందని, ఓ దశలో ఆయనను గృహనిర్బంధంలో ఉంచారని, సైన్యం పగ్గాలకు దారితీసిందనే సంచలన వార్తలు వెలువడ్డా అవి తరువాత సద్దుమణిగాయి. ఇప్పుడు పార్టీలో భారీ స్థాయి మార్పులతో వ్యతిరేకతను చల్లార్చాలని జిన్‌పింగ్ పావులు కదిపినట్లు స్పష్టం అయింది.
రికార్డు స్థాయిలో మూడోసారి అధినేతగా ఎన్నిక కావడం ద్వారా ఆయన జీవితకాల దేశాధినేతగా తిరుగులేకుండా ఉండేందుకు బాటలు ఏర్పర్చుకున్నరు. ఇప్పటికే సెంట్రల్ కమిటీలో అత్యధిక సంఖ్యలో ఆయన సన్నిహితులు, విధేయులు చోటు దక్కించుకున్నారు. 

ఇప్పుడు కమిటీలో పేర్లు దక్కని వారిలో ప్రధాని లి, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ లి జాంషూ, వాంగ్‌యాంగ్, ఉప ప్రధాని జెంగ్ వంటి వారు ఉన్నారు. వీరి పేర్లు కమిటీలో లేకపోవడం కొట్టొచ్చిన పరిణామం అయింది.

ఇంతకు ముందటి స్టాండింగ్ కమిటీలో ఉన్న ఏడుగురు ప్రముఖ నేతలకు ఈసారి చోటు లేకపోవడం కీలకం అయింది. లీ, వాంగ్‌లనుదేశంలో మితవాదులుగా పిలుస్తారు. వీరే దేశ ఆర్థిక వ్యవస్థను పది సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటున్నారు.