శ్రీకృష్ణుడు జీహాద్ పాఠాలు చెప్పాడా? .. మండిపడ్డ బీజేపీ

జిహాద్‌ భావన కేవలం ఖురాన్ లోనే కాదు.. భగవద్గీత, క్రైస్తవంలోనూ ఉందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి శివరాజ్‌ పాటిల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపింది.  కేంద్ర మాజీ మంత్రి మొహిసినా కిద్వాయ్‌ జీవితగాథ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన ఈ మాటలు మాట్లాడారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన బిజెపి  కాంగ్రెస్‌ చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు పాటిల్‌ వ్యాఖ్యలు నిదర్శనమని విమర్శించింది.  జిహాద్ గురించి గీతలో ప్రస్తావించారన్న శివరాజ్ పాటిల్ మహాభారత యుద్ద సమయంలోనూ శ్రీ కృష్ణుడు, అర్జునుడికి పాఠాలు చెప్పాడని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు శశి థరూర్, దిగ్విజయ సింగ్, ఫరూఖ్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ షిండే తదితరులు పాల్గొన్నారు. ఇస్లాంలో జీహాద్ గురించి సుదీర్ఘ చర్చ ఉందని అంటారని పేర్కొంటూ అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ, సదుద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోతే, అధికారాన్ని ఉపయోగించవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని భగవద్గీత, ఖురాన్‌లలో పేర్కొన్నారని చెప్పారు. 
 
“అంతా వివరించిన తర్వాత కూడా, ప్రజలు అర్థం చేసుకోకపోతే,  వారు ఆయుధాలతో వస్తున్నట్లయితే మీరు పరుగెత్తలేరు, మీరు జిహాద్ అని పిలవలేరు, మీరు దానిని తప్పుగా భావించలేరు, ఇది అర్థం చేసుకోవాలి.  చేతిలో ఉన్న ఆయుధాలతో ప్రజలకు అర్థమయ్యేలా చేసే ఈ భావన ఉండకూడదు” అంటూ చెప్పుకొచ్చారు. 
 
క్రైస్తవంలో కూడా జిహాద్ ఉన్నదంటూ స్వయంగా క్రిస్ట్ తాను శాంతికోసం ఈ లోకంలోకి రాలేదని, కత్తితో వచ్చానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఒకరిని మించి మరొకరు హిందూ విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు గోపాల్ ఇటాలియా, రాజేంద్ర పాల్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అర్జునుడికి జీహాద్ పాఠాలు చెప్పాడని అంటున్నారని ఆయన మండిపడ్డారు.  హిందూ/కాషాయ ఉగ్రవాదం పదాలను కాంగ్రెస్ సృష్టించిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని, శ్రీరాముడి అస్తిత్వాన్ని ఆ పార్టీ వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు. హిందుత్వ అంటే ఐసిస్ (ఉగ్రవాద సంస్థ)తో సమానమని చెప్పిందని తెలిపారు. హిందూ సంస్థల కన్నా లష్కరే తొయిబా తక్కువ ప్రమాదకారి అని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు.
 
కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్ 2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల నిందను హిందువులపై మోపారని తెలిపారు.  గుజరాత్ శాసన సభ ఎన్నికలకు ముందు హిందువులపై విద్వేషాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రదర్శిస్తున్నారని బీజేపీ నేత  ఆరోపించారు. ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకోవడం కోసమే హిందువులపై ద్వేషం పూరితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 
 
కాగా, కరోనా మహమ్మారి ప్రారంభ రోజులలో ఒక టెలివిజన్ చర్చలో ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నాయకుడు సూర్యకాంత్ ధస్మనా శ్రీకృష్ణుడు కరోనాను పంపాడని అంటూ వివాదం సృష్టించాడు. అందుకు ఆయన చెప్పిన కారణం రెండు పేర్లలో గల సారూప్యత. కృష్ణుడు, కరోనా రెండూ `కె’ అక్షరంతో ప్రారంభం కావడమే. వెంటనే ఈ  ప్రకతన పట్ల ట్విట్టర్‌లో ఆగ్రవేశాలు సృష్టించింది. “కాంగ్రెస్ నాయకులు హిందూ దేవుళ్లపై ద్వేషాన్ని ఎందుకు వ్యాపింపజేస్తారు?” అంటూ పలువురు ప్రశ్నించారు.