ప్రధాని మోదీ కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ కేదార్ నాథ్ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని  రాకతో  కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను రెండు క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో మోదీ  సంప్రదాయ పహాడీ దుస్తుల్లో కనిపించారు. 
 
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా మహిళలు తయారు చేసిన దుస్తులను ఆయన ధరించారు. ప్రధాని వెంట ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఉన్నారు. ఆయన రెండు రోజులపాటు ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలిస్తారు.
ప్రధాని ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించినపుడు ఆ రాష్ట్ర మహిళలు ఈ సంప్రదాయ దుస్తులను ఆయనకు బహూకరించారు. చంబా జిల్లాలో మహిళలు చేతితో ఈ దుస్తులను తయారు చేస్తారు. వీటిని స్వీకరించిన మోదీ తాను శీతల ప్రాంతాలకు వెళ్లినపుడు ఈ దుస్తులను ధరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
మోదీ శుక్రవారం గౌరీకుండ్-కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. రూ. 3,400 కోట్ల వ్యయంతో 9.7 కిలోమీటర్ల పొడవున ఈ రోప్‌వేను నిర్మిస్తారు. గౌరీ కుండ్ నుంచి  కేదార్ నాథ్ , గోవింద్ ఘాట్  నుంచి హేమకుండ్ సాహిబ్ లను  కలుపుతూ రెండు కొత్త  రోప్ వే  ప్రాజెక్టులు రానున్నాయి.   
దీంతోపాటు కేదార్‌నాథ్, బదరీనాథ్ ధామ్‌లలో అనేక కనెక్టివిటీ ప్రాజెక్టులను నిర్మిస్తారు. ఎన్‌హెచ్-7 రోడ్డు విస్తరణ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేస్తారు.  హృషీకేశ్, జోషీమఠ్, బదరీనాథ్‌లను డెహ్రాడూన్, చండీగఢ్, ఎన్‌హెచ్-107లను ఈ ప్రాజెక్టులు కలుపుతాయి.
రుద్ర ప్రయాద్ నుంచి గౌరీకుండ్ వరకు అనుసంధానమవుతుంది. ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలాన్ని కూడా ప్రధాని  సందర్శించనున్నారు. దీంతో పాటు కేదార్‌నాథ్‌లోని మందకి అస్త పథం, సరస్వతీ అస్థి పథాలను మోడీ పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. 
 
ఆ తర్వాత బద్రీనాథ్ ధామ్‌కు చేరుకుని ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన అనంతరం రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల పురోగతిని ప్రధాని సమీక్షిస్తారు.  మోదీ రాక సందర్భంగా కేదార్‌నాథ్, బదరీనాథ్ దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. రకరకాల పువ్వులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు  ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ అదనపు డైరెక్టర్ జనరల్ మనోజ్ రావత్ చెప్పారు.