పవన్ `జనవాణి’ ర్యాలీని అడ్డుకున్న విశాఖ పోలీసులు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ను జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడంతో విశాఖపట్నం నగరంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు యాక్టు-30 అమల్లో ఉందంటూ సభలు, సమావేశాలు జరపొద్దని అడ్డుకోవడం, శనివారం అర్ధరాత్రే జనసేన నాయకులను అరెస్టు చేయడంతో జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

‘రాష్ట్రంలో యుద్ధం మొదలైంది.. మీరు ప్రారంభించారు. దానిని స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని జగన్‌ ప్రభుత్వానికి పవన్‌ సవాల్‌ విసిరారు.‘దెబ్బలు తినకుండా, జైళ్లకు వెళ్లకుండా, కేసులు పడకుండా రాజకీయాలు సాధ్యం కాదు. ప్రజల కోసం ఎన్ని కేసులనైనా స్వీకరిస్తా.. జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం’ అని స్పష్టం చేశారు. 

పవన్ కళ్యాణ్ బసచేసిన హోటల్ ను పోలీసులు స్వాధీనంలోకి తీసుకొని, అటువైపు ఎవ్వరు వెళ్లకుండా భీభత్సవం సృష్టించారు.  అరెస్ట్ చేసిన తమ పార్టీ కార్యకర్తలను  వదిలిపెడితే తప్ప ఇక్కడ నుంచి కదిలేది లేదని పవన్‌ భీష్మించుకోవడంతో  హోటల్‌ను చుట్టుముట్టిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తారని, నగరం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారన్న ప్రచారంతో జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు.

ఆంక్షల నేపథ్యంలో చివరకు జనవాణిని రద్దు చేసుకోవలసి వచ్చింది.  నగర పోలీసులతోపాటు ఏపీఎస్పీ, ఆర్మ్‌డ్‌ రిజర్వు బలగాలను రప్పించి హోటల్‌ చుట్టూ వలయంగా ఏర్పాటుచేశారు. అక్కడకు దారితీసే అన్ని మార్గాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. వాహనాలను ఆపి వివరాలు అడిగిన తర్వాతే అనుమతించారు. జనసేన నేతలు, కార్యకర్తలైతే వెనక్కి పంపించారు. .

షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పవన్‌ హోటల్‌ నుంచి బయలుదేరి పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమంలో పాల్గొనాలి. దీంతో ఆడిటోరియం వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పోలీసు యాక్ట్‌-30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ నోటీసు ఇచ్చారు.

పోలీసు యాక్ట్‌  ఉన్నప్పటికీ శనివారం ఎయిర్‌పోర్టులో 500 మందికి పైగా నేతలతో పవన్‌ గుమిగూడారని, ఎన్‌ఏడీ జంక్షన్‌ మీదుగా నోవాటెల్‌కు భారీ ర్యాలీ నిర్వహించారని అందులో ఆక్షేపించారు. మీ ఆధ్వర్యంలోని జనసేన మద్దతుదారులు మంత్రులు, పౌరులు, పోలీసు అధికారులపై దాడి చేసి పబ్లిక్‌ ఆర్డర్‌కు భంగం కలిగించారని, దాడిలో కొందరు ప్రజాప్రతినిధులు, పౌరులు, పోలీసు అధికారులు గాయపడ్డారని తెలిపారు.

ఈ ఘటన శాంతిభద్రతలకు భంగం కలిగించిందని, ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని.. ఆదివారం ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదని, డ్రోన్లు కూడా ఉపయోగించరాదని నోటీసులో స్పష్టం చేశారు.