మద్యం కేసులో మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు

ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసులో ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సమన్లు జారీ చేసింది. అక్టోబరు 17 సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. 
 
ఈ కేసులో సీబీఐ పేర్కొన్న నిందితుల్లో మనీశ్ సిసోడియా ఒకరనే విషయం తెలిసిందే.  సోసిడియాతో పాటు ఈ కుంభకోణంతో  సంబంధముందని భావిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను కూడా సీబీఐ అధికారులు రేపు ప్రశ్నించనున్నారు. 
 
మనీశ్ సిసోడియా ఆదివారం స్పందిస్తూ ఇచ్చిన ఓ ట్వీట్‌లో “మా ఇంట్లో 14 గంటలు సోదాలు నిర్వహించారు. నా బ్యాంక్ లాకర్ తనిఖీ చేశారు. నా సొంత ఊరిలోనూ సోదాలు చేశారు. సీబీఐకి ఎక్కడా ఏమీ దొరకలేదు. ఇప్పుడు సోమవారం ఉ.11గంటలకు సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో విచారణకురావాలని పిలిచారు. విచారణకు పూర్తిగా సహకరిస్తా. సత్యమేవ జయతే” అని తెలిపారు. 
 ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ నూతన ఎక్సైజ్ విధానంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా  జూలైలో ఆదేశించారు. ఈ విధానం గత ఏడాది నవంబరులో అమల్లోకి వచ్చింది. అయితే ఆ విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో ఉపసంహరించింది.
ఇప్పటికే ఈ కేసుపై సిబిఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని భావిస్తున్న పలువురు వ్యక్తులను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారించాయి. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన అభిషేక్ రావును సిబిఐ అధికారులు ఏకంగా 5 రోజుల పాటు విచారించారు.
ఈ విచారణ ముగిసిన మరునాడే సిసోడియాకు సిబిఐ అధికారులు సమన్లు జారీ చేయడం గమనార్హం.  సీబీఐ సోదాలు చేసి, మనీశ్ సిసోడియాతో సహా 15 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. సిసోడియా సన్నిహతుడు, ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ విజయ్ నాయర్‌ను, అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అరెస్టు చేసింది.