సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి చేరిన హిజాబ్ వివాదం 

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి చేరిన హిజాబ్ వివాదం 
విద్యా సంస్థల తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వక పోవడంతో ఇప్పుడు ఈ వివాదం ప్రధాన న్యాయమూర్తి ముందుకు చేరింది. ముస్లిం విద్యార్థినిలు విద్యాసంస్థల్లో హిజాబ్  ధ‌రించ‌రాదని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది.
అయితే, ధ‌ర్మాస‌నంలోని ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు వేర్వేరు అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు. క‌ర్నాట‌క ప్ర‌భుత్వ హిజాబ్ నిషేధ ఆదేశాల‌ను జ‌స్టిస్ హేమంత్ గుప్తా స్వాగ‌తించారు. ఇక ఆ ధ‌ర్మాస‌నంలో ఉన్న మ‌రో న్యాయ‌మూర్తి సుధాన్షు దులియా మాత్రం ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కొట్టిపారేశారు.
ఈ కేసులో భిన్నాభిప్రాయం ఉంద‌ని, అందుకే అప్పీల్‌ను డిస్మ‌స్ చేస్తున్న‌ట్లు జ‌స్టిస్ హేమంత్ గుప్తా తెలిపారు. ఇక జ‌స్టిస్ దులియా మాత్రం అప్పీల్‌ను ఆమోదిస్తూ, క‌ర్నాట‌క ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ర‌ద్దు చేశారు. అమ్మాయిల‌కు విద్య‌ను అందించ‌డమే త‌న‌కు ప్రాముఖ్య‌మైన విష‌య‌మ‌ని, అయితే హిజాబ్‌ను నిషేధించ‌డం వ‌ల్ల ఆ అమ్మాయిల జీవితాలు బాగుప‌డుతాయా ?అని జ‌స్టిస్ దులియా ప్ర‌శ్నించారు.
క‌ర్నాట‌క హిజాబ్ వివాదాన్ని ఇప్పుడు మ‌రింత విస్తృత ధ‌ర్మాస‌నం విచారించ‌నున్న‌ది. భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో.. ఈ కేసును సీజేఐ ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. ఇక హిజాబ్ వివాదంపై జ‌స్టిస్ గుప్తా స్పందిస్తూ మొత్తం 11 ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తారు.

ఇస్లాం ప్ర‌కారం హిజాబ్‌ను ధ‌రించ‌డం మ‌త‌ప‌రంగా అత్య‌వ‌స‌రం ఏమీ కాదు అని, ప్ర‌భుత్వ ఆదేశాలు స‌రిగ్గానే ఉన్న‌ట్లు జ‌స్టిస్ గుప్తా తెలిపారు.ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు మార్చిలో ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా ధ్రువీకరించారు.  ఆ కార‌ణాల చేత అప్పీల్‌ను డిస్మిస్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

అయితే,  క‌ర్నాట‌క హైకోర్టు ఈ కేసులో త‌ప్పుడు విధానంలో వెళ్లిన‌ట్లు జ‌స్టిస్ దులియా తెలిపారు. జస్టిస్ ధూలియా మాట్లాడుతూ, హిజాబ్ ధారణ అనేది ఓ ఛాయిస్ అని, అంతకన్నా ఎక్కువ కానీ, తక్కువ కానీ కాదని తెలిపారు. బాలికల విద్య గురించిన ఆలోచన తన మనసులో ప్రధానంగా ఉందని చెప్పారు. తాను తన సోదర న్యాయమూర్తితో గౌరవప్రదంగా విభేదిస్తున్నానని తెలిపారు. 

ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తామని జస్టిస్ ధూలియా చెప్పారు.  కర్ణాటకలోని ఉడుపిలో ప్రభుత్వ పీయూ కళాశాలలో హిజాబ్ వివాదం ప్రారంభమైన సంగతి తెలిసిందే. విద్యార్థినులు హిజాబ్ ధరించి, తరగతి గదుల్లో ప్రవేశించడాన్ని కళాశాల యాజమాన్యం తిరస్కరించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

ఈ వివాదం ముదరడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాల్లో తరగతి గదుల్లో హిజాబ్, మతపరమైన వస్త్రాల ధారణను నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు మార్చిలో తీర్పు చెప్పింది. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ చెప్పలేదని తెలిపింది.

ఈ వస్త్రం సాంఘిక భద్రతకు సంబంధించినదని, దీనిని బహిరంగ ప్రదేశాల్లో ధరించవచ్చునని తెలిపింది. ఇది మతపరమైనది కాదని వివరించింది. కర్ణాటకలో హిజాబ్ వివాదాన్ని రెచ్చగొడుతున్న శక్తులపై వేగంగా, సమర్థవంతంగా దర్యాప్తు చేయాలని చెప్పింది. సాంఘిక అశాంతిని సృష్టించేందుకు అదృశ్య శక్తులు పని చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.

హిజాబ్ పై నిషేధం కొనసాగుతుంది

 కాగా, విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో కర్ణాటకలో హిజాబ్ ధారణపై నిషేధం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
 
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ మీడియాతో మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులు, మహిళలు హిజాబ్ ధరించడంపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు మెరుగైన తీర్పు ఇస్తుందని తాము ఆశించామన్నారు. అయితే ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 
 
కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ,  విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో యూనిఫాం కోడ్‌ను ప్రభుత్వం నిర్దేశించిందని చెప్పారు. తమ వైఖరిలో ఎటువంటి మార్పు లేదన్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని  తెలిపారు.