రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు రావాల్సిన నిధుల కోసం వచ్చిన పంచాయతీ సర్పంచ్‌లను ఏపీ ప్రభుత్వం కనీసం పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలోకి కూడా రానీయ్యకుండా పోలీసులతోఅడ్డుకొని, బలవంతంగా అరెస్ట్‌లుచేసి లారీల్లో తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.8, 000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్ళించింది.
విద్యుత్ బకాయిల పేరుతో జమ చేసుకోవడానికి జిఓలు జారీ చేసింది. పంచాయతీల అనుమతి లేకుండా తీసుకున్న ఈ చర్యను వ్యతిరేకిస్తూ మళ్లించిన మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ పదేపదే చేసిన విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది.
దీంతో మరో మార్గం లేక రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి శుక్రవారం పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయానికి వందలాది మంది సర్పంచ్‌లు చేరుకున్నారు.
అంతకుయుందు తమకు నిధులు ఇవ్వాలని, లేని పక్షంలో పదవుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలోని జాతీయ రహదారి పక్కనున్న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని సర్పంచ్‌లు ముట్టడించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని అడ్డుకున్నారు. నిధుల విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదంటూ సర్పంచులు సుమారు 100 మందికి పైగా రోడ్డుపైనే బైఠాయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయాల నుండి ప్రజలకు డబ్బులు వేస్తున్నామని చెబుతున్నారని, కానీ పంచాయతీల్లో రోడ్లను పట్టించుకోవడం లేదని, ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధులు ఇవ్వబోమని చెబితే అసలు పోటీయే చేసేవాళ్లం కాదని, ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ వీరి సమస్యలు వినడానికి బదులుగా ‘ఏం దబాయిస్తున్నారా? డబ్బులు ఇవ్వకపోతే ఏంటి? ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ మాట్లాడారు.
ఆయన వ్యాఖ్యలకు నిరసనగా కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు సర్పంచ్‌లు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా రోడ్డుపైని లాక్కొచ్చి అప్పటికే సిద్ధం చేసిన లారీల్లో ఎక్కించారు. పలువురు సర్పంచులైతే ప్రభుత్వ తీరుకు నిరసనగా స్వచ్ఛంద అరెస్టు అయ్యి తమ నిరసన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
అంతకుముందు సర్పంచ్‌లు మాట్లాడుతూ సొంత నిధులతో ప్రభుత్వ కార్యక్రమాలు చేయలేమని, చెత్త ఎత్తేవాళ్లకు కూడా నిధులు లేకపోవడంతో వారూ రెండు నెలలుగా పనులకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ నిధులు ఇవ్వకపోతే పంచాయతీల్లో పనులు ఏమీ చేయొద్దని అర్డర్ అన్నా ఇవ్వాలని కోరారు. అదీ సాధ్యం కాకపోతే ప్రత్యేక అధికారులను పెట్టుకుని పాలన చేసుకోవాలని డిమాండు చేశారు. తమను పదవుల్లో నుండి తొలగించాలని కోరారు.
పంచాయతీరాజ్ కమిషనర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన సర్పంచ్ లను అరెస్ట్ చేయడం దారుణం అంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవిబి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్ధిక కమీషన్ ల సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 12,918 గ్రామా పంచాయతీలకు పంపిన రూ. 8,700 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన గ్రామ పంచాయతీల ఖాతాలలో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
ప్రధాని ఆర్దిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేవరాయ్ మృతి
ఈ దీపావళికి చైనాకు రూ.1.25 లక్షల కోట్ల నష్టం
19 భారతీయ సంస్థలు, ఇద్దరు భారతీయులపై అమెరికా ఆంక్షలు