భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం

భారత వాయుసేన 90వ వార్షికోత్సవం చండీగఢ్​లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకత. 

ఈ యూనిఫాంను ఎయిర్ ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్‌) సంయుక్తంగా రూపొందించాయి. ఢిల్లీ ఆవల తొలిసారి ఐఏఎఫ్‌ రైజింగ్‌ డే ఉత్సవాలు జరిగాయి. చండీగఢ్‌లో జరిపిన ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరీ హాజరయ్యారు. 

ఇదే సందర్భంలో వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌ కూడా ఏర్పాటైంది. భారత వైమానిక దళంలో పనిచేస్తున్న సైనికుల కోసం ప్రభుత్వం శనివారం కొత్త యూనిఫాంను విడుదల చేసింది. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా వైమానిక దళానికి కొత్త కార్యాచరణ శాఖ వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు ఎయిర్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరి తెలిపారు.

 వెప‌న్ సిస్ట‌మ్ శాఖ వ‌ల్ల ఫ్ల‌యింగ్ శిక్ష‌ణ కోసం అయ్యే ఖ‌ర్చుల్లో సుమారు రూ. 3400 కోట్ల‌ను ఆదా చేయ‌వ‌చ్చు అని చౌద‌రీ తెలిపారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో 3వేల మంది అగ్నివీరుల‌కు వాయు సేన కోసం శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ సంఖ్య‌ను మునుముందు పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

వ‌చ్చే ఏడాది నుంచి మ‌హిళా అగ్నివీరుల్ని ర్రికూట్ చేసేందుకు ప్లాన్ వేస్తున్న‌ట్లు ఐఏఎఫ్ చీఫ్ తెలిపారు. దీని కోసం మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో నిమ‌గ్న‌మైన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

ఈ కొత్త యూనిఫాం సైన్యం యూనిఫారాన్ని పోలి ఉంటుంది. వైమానిక దళం థీమ్ ఈసారి ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్’ అని తయారుచేశారు. యూనిఫాం డిజిటల్ నమూనా ఎడారి, పర్వత భూమి, అడవి వంటి ప్రదేశాల్లో సైనికులు తమ విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ యూనిఫాంను తేలికపాటి ఫాబ్రిక్, డిజైన్‌తో తయారు చేశారు. కొత్త కంబాట్ యూనిఫామ్‌లో కంబాట్ టీ-షర్ట్, ఫీల్డ్ స్కేల్ డిస్‌రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్ట్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్‌లెట్ కంబాట్ బూట్లు, మ్యాచింగ్ టర్బన్ ఉన్నాయి.  మొత్తం 1.70 లక్షల మంది సిబ్బంది, 1300పైగా యుద్ధ విమానాలతో ప్రపంచంలోనే నాలుగో పెద్ద వైమానిక దళంగా గుర్తింపు పొందింది.