పాక్ వైపు నుండి వచ్చిన డ్రోన్ కూల్చివేత

పాకిస్థాన్‌ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా డ్రోన్లు రావడం ఇటీవల నిత్యకృత్యంగా మారింది. ఇప్పటివరకు ఎన్నో డ్రోన్లను సరిహద్దు దళాలు కూల్చిశాయి. కాగా, బుధవారం అర్ధరాత్రి అమృత్‌సర్‌ వైపునకు వస్తున్న డ్రోన్‌పై బీఎస్‌ఎఫ్‌ కాల్పులు జరిపి కూల్చివేసింది. 

ఈ డ్రోన్ల ద్వారా మన దేశంలోకి మత్తు మందుతోపాటు మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నట్లు సరిహద్దు దళాలు గుర్తించాయి. సరిహద్దును దాటుకుని పాకిస్థాన్‌ డ్రోన్లు మన దేశంలోకి మత్తు మందుతోపాటు మందుగుండును సరఫరా చేస్తున్నాయి. సరిహద్దు దళాల కండ్లు గప్పి మరీ ఇలా విధ్వంసానికి సాయపడుతున్న పలు డ్రోన్లను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేస్తున్నారు.

తాజాగా బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ వైపు నుంచి సరిహద్దు మీదుగా అమృత్‌సర్‌ వైపున బీఏపీ చన్నాకు 400 మీటర్ల దూరంలో డ్రోన్‌ కనిపించింది. దీనిని గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ 38 రౌండ్ల కాల్పులు జరపడంతో పాటు తేలికపాటి బాంబులు వేసింది. తొలి డ్రోన్‌ కనిపించిన 5 నిమిషాలకు మరో డ్రోన్‌ వచ్చింది.

దీనిపై కూడా బీఎస్‌ఎఫ్‌ దళాలు అప్రమత్తమై 13 రౌండ్ల కాల్పులు జరిపాయి. అయితే, ఈ డ్రోన్‌ తప్పించుకుని పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయింది. అనంతరం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించగా.. రత్న ఖుర్ద్‌ ప్రాంతంలో రెండు ఆకుపచ్చ కూల్‌డ్రింక్‌ బాటిళ్లలో నింపిన హెరాయిన్‌ను గుర్తించింది.  రెండు బాటిళ్లలో ఉన్న 940 గ్రాముల హెరాయిన్‌ ఉన్నదని, దీని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరో చోట తుపాకీ బుల్లెట్లను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గుర్తించారు.