పాక్ లో భారతీయ ఖైదీల మృతిపై భారత్ ఆందోళన

పాకిస్తాన్ జైళ్ళలో భారతీయ ఖైదీలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శిక్షా కాలం పూర్తయిన తర్వాత కూడా నిర్బంధంలో ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గడచిన తొమ్మిది నెలల్లో ఆరుగురు మరణించడంపై తన ఆందోళనను పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి   మీడియాతో మాట్లాడుతూ, గడచిన తొమ్మిది నెలల్లో ఆరుగురు భారతీయులు పాకిస్థాన్ జైళ్ళలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇటీవలి కాలంలో భారతీయ  మత్స్యకారుల మరణాలు పెరుగుతున్నాయన్నారు. శిక్షా కాలం పూర్తయిన తర్వాత కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారని పేర్కొన్నారు.

పాకిస్థాన్ జైళ్ళలో గడచిన తొమ్మిది నెలల్లో  మరణించిన ఆరుగురిలో ఐదుగురికి శిక్షా కాలం పూర్తయిందని, అయినప్పటికీ వారిని జైళ్ళలో చట్టవిరుద్ధంగా నిర్బంధించారని తెలిపారు. ఇది చాలా ఆందోళనకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్ పాకిస్థాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు.

భారతీయ ఖైదీలకు భద్రత కల్పించవలసిన విధి, కర్తవ్యం పాకిస్థాన్‌కు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇస్లామాబాద్‌లోని అమెరికన్ రాయబారి ఇటీవల పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో పర్యటించడం పట్ల భారత ప్రభుత్వ అభ్యంతరాన్ని అమెరికాకు తెలిపామని చెప్పారు.

ఇదిలావుండగా, అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో భారతీయ మత్స్యకార పడవకు బుధవారం ప్రమాదం జరిగిందని పాకిస్థాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన ఈ పడవలోని  ఆరుగురు భారతీయ మత్స్యకారులను తమ గస్తీ నౌక కాపాడినట్లు తెలిపింది. వీరందరికీ తాము ఆహారం, మందులు అందజేసినట్లు పేర్కొంది. వీరిని ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకకు అప్పగించినట్లు వివరించింది.