ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌, బీట్స్ హెడ్‌ఫోన్ కూడా భారత్ లో ఉత్ప‌త్తి

క్రమంగా చైనా నుండి తమ ఉత్పత్తులను తరలించుకొంటున్న గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం ఆపిల్‌ ఇప్పటికే  ఐ-ఫోన్ల ఉత్ప‌త్తిని భార‌త్‌లో పెంచాల‌ని నిర్ణ‌యించింది. తాజాగా, ఎయిర్‌పాడ్స్‌, బీట్స్ హెడ్‌ఫోన్ ఉత్ప‌త్తి కూడా కొంత మేర‌కు భార‌త్‌కు త‌ర‌లించాల‌ని త‌మ స‌ర‌ఫ‌రా దారుల‌ను కోరింది. 

త‌న స‌ర‌ఫ‌రా దారుల‌ను భార‌త్‌లో ఉత్ప‌త్తిని పెంచాల‌ని కోర‌డం ఇదే తొలిసారి. భార‌త్‌లో ఎల‌క్ట్రానిక్స్ మాన్యుఫాక్చ‌రింగ్‌ను ప్రోత్స‌హించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన మ‌రో విజ‌యంగా ప‌రిగ‌ణిస్తున్నారు. ఆపిల్ త‌యారుచేసే ఐ-ఫోన్ అసెంబ్లింగ్ సంస్థ ఫాక్స్‌కాన్‌.. బీట్స్ హెడ్‌ఫోన్స్ కూడా భార‌త్‌లో త‌యారు చేస్తున్న‌ది.

అలాగే ఎయిర్ పాడ్స్ కూడా ఫాక్స్‌కాన్ సంస్థే త‌యారు చేస్తున్న‌ద‌ని సంస్థ వ‌ర్గాలు తెలిపాయి. చైనాలో ఐ-ఫోన్ త‌యారీ దారుగా ఉన్న ల‌క్స్‌షేర్ ప్రిసిసియాన్ కంపెనీని సైతం భార‌త్‌లో ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి చేప‌ట్టాల‌న్న ప్లాన్‌కు స‌హ‌క‌రించాల‌ని ఆపిల్ కోరింద‌ని స‌మాచారం.

ల‌క్స్‌షేర్ ఎక్కువ‌గా త‌న వియ‌త్నామీస్ ఎయిర్‌పాడ్స్ ఆప‌రేష‌న్స్‌పైనే దృష్టి పెట్టింది. భార‌త్‌లో ఆపిల్ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేస్తున్న త‌న ప్ర‌త్య‌ర్థి సంస్థ‌ల‌తో పోలిస్తే ల‌క్స్‌షేర్ వెనుక‌బ‌డి ఉంద‌ని స‌మాచారం.

 దీనిపై స్పందించ‌డానికి ఆపిల్ ముందుకు రాలేద‌ని రాయిట‌ర్స్ పేర్కొంది. భార‌త్‌తోపాటు ఇత‌ర మార్కెట్ల‌కు ఐఫోన్ల ఉత్ప‌త్తిని మ‌ళ్లించ‌డానికి ఆపిల్ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. ఐ-ఫోన్‌-14ను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేయాల‌ని ఆపిల్ ఇటీవ‌లే నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.