విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో హైదరాబాద్ యూనివర్సిటీ

భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో హైదరాబాద్ కేంద్ర  విశ్వవిద్యాలయం అత్యుత్తమ కేంద్రంగా ఆవిర్భవించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందనలు తెలిపారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్నప్పుడు యూఓహెచ్‌ (యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్) మన విజ్ఞాన ఆధారిత సమాజంలో ప్రధాన కేంద్రాలలో ఒకటిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొంటూ మన విద్యార్థులు తమ విద్యను మరింత అర్థవంతంగా, ఉద్దేశపూర్వకంగా చేయడానికి సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. భారతదేశం ఆర్థిక సూపర్ పవర్, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఆవిష్కరణలు, వ్యవస్థాపకత సహాయపడుతుందని చెప్పారు. 

విద్యను మరింత అర్థవంతం చేయడానికి, సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని విద్యార్థులకు కేంద్ర మంత్రి పిలుపు నిచ్చారు. ఆయన ఓ సారూప్యతను వివరిస్తూ “హైదరాబాద్‌ను అలంకార ముత్యాల నగరంగా పిలుస్తారు, ఇప్పుడు  హైదరాబాద్ విశ్వవిద్యాలయం మేధో ముత్యం” అని ప్రశంసించారు. 

 “జీవితంలో విజయం సాధించాలంటే మూడు మంత్రాలు మాత్రమే ఉన్నాయి – హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్” అని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చీఫ్ రెక్టార్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ తెలిపారు. స్వామి వివేకానంద సూచించిన విధంగా పరిశోధనలను తమ జీవితంలో ఒక భాగంగా  చేసుకోవాలని, తమ అంతర్గత బలాలపై దృష్టి పెట్టాలని ఆమె విద్యార్థులకు తెలిపారు.

2020, 2021, 2022 సంవత్సరాల్లో వివిధ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న 4800 మంది విద్యార్థులకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం డిగ్రీలను అందించింది. వీరిలో 573 మంది పిహెచ్‌డి పొందారు. అలాగే అసాధారణ ప్రతిభ చూపిన 484 మంది విద్యార్ధులను అవార్డులు, పతకాలతో సత్కరించారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్ల తర్వాత ఈ వేడుకను నిర్వహించారు. 

యూనివర్శిటీ గౌరవ ఛాన్సలర్ జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి ఉత్సవాలను ప్రారంభించి గ్రహీతలతో ప్రమాణం చేయించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.జె.రావు తన వార్షిక నివేదికలో అంతర్జాతీయీకరణ ప్రయత్నాలను పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలతో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.