గరుడ వాహన సేవకు తిరుమలకు పోటెత్తిన భక్తులు

కరోనా కారణంగా రెండేళ్లపాటు భక్తులకు అవకాశం కల్పించని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం నాటికి ఈ వేడుకలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. శనివారం రాత్రి గరుడ వాహనసేవలో పాల్గొనేందుకు విశేష సంఖ్యలో భక్తజనం తిరుమలకు పోటెత్తింది. తిరుమల మొత్తం భక్తులతో నిండిపోయింది. 

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

శ‌నివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. 

దాదాపు 4.50 లక్షల మంది గరుడవాహన సేవను తిలకిస్తున్నట్లు  టీటీడీ అధికారులు అంచనావేశారు. భక్తులందరికి గరుడ వాహన సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల సంఖ్య విశేషంగా ఉండటంతో తిరుమల గిరులు స్వామివారి నామంతో మార్మోగిపోతున్నది. గరుడ వాహనసేవ సందర్భంగా 5 వేల మందితో పోలీసులు భద్రత నిర్వహించారు. గ్యాల‌రీల్లో ఉద‌యం 6 నుంచి రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు అన్నప్రసాదాలు, తాగునీరు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

గరుడ సేవలో స్వామి వారికి అలంకరించేందుకు ప్రత్యేక గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరాయి. చెన్నైలోని హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్‌ఆర్‌ గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమల చేరిన గొడుగులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

గరుడ వాహనసేవకు యాత్రికులు పోటెత్తుతుండటంతో రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులను కొండపైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లే ప్రైవేటు వాహానాలను అలిపిరి టోల్‌గేట్‌ వద్దే పోలీసులు నిలిపి వేస్తుండడంతో అలిపిరి నుంచి కపిల తీర్థం వరకు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.